‘నా కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను. గత కొన్నేళ్లుగా వరుసగా నాలుగు విజయాలను సాధించడం ఆనందంగా ఉంది. ప్రతీ సినిమాను ఓ ఛాలెంజ్‌గా భావించి చేశాను. నీటి సమస్యను చర్చిస్తూ గొప్ప సామాజిక సందేశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రజల్లో ఆలోచనలను రేకెత్తించే ఇలాంటి సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది’ అన్నారు అగ్ర నటుడు బాలకృష్ణ.
ఆయన కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘డాకు మహారాజ్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శుక్రవారం విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘ దర్శకుడు బాబీ ఈ సినిమా ద్వారా నా నట విశ్వరూపాన్ని రాబట్టుకున్నాడు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. రైటర్స్, టెక్నీషియన్స్ అందరూ శ్రమించి ఈ కథను అద్భుతంగా తీర్చిదిద్దారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు ఇప్పటి నుంచి ‘ఎన్బీకే తమన్’ అని నామకరణం చేస్తున్నా. అంత గొప్పగా మ్యూజిక్ ఇచ్చాడు. అన్ని విభాగాల మీద పట్టున్న నాగవంశీ వంటి నిర్మాత దొరకడం అదృష్టం. ఆయన భవిష్యత్తులో మరి న్ని విజయవంతమైన చిత్రాలు తీయాలని కోరుకుంటున్నా. నా రికార్డులు, కలెక్షన్స్, అవార్డులు, రివార్డులన్నీ అన్‌స్టాపబుల్’ అన్నారు. చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో బాలకృష్ణను కొత్తగా చూపించాలని ముందే అనుకున్నాం.
ఆ ప్రయత్నంలో విజయం సాధిం చాం. నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఈ మధ్య మమ్మ ల్ని కలిసినప్పుడు ఇదొక క్లాస్‌మాస్ ఫిల్మ్ అని ప్రశంసించారు. డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయితే అదే మాకు పెద్ద సక్సెస్. ఈ సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు’ అన్నారు. దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ ‘బాలకృష్ణగారికి బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాలనుకున్నా. ఆయన కెరీర్లో మాస్టర్‌పీస్ తీశానని చాలా మంది చెప్పడం గొప్ప అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నా’ అన్నారు.