అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటించిన మోస్ట్ ఎవైటెడ్ డివైన్ పానిండియా యాక్షన్ డ్రామా ‘అఖండ 2: తాండవం’. బ్లాక్‌బస్టర్ ‘అఖండ’కు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తున్నది. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రధారులు. బోయపాటి శ్రీను దర్శకుడు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలు. ఎం.తేజస్వినీ నందమూరి సమర్పకురాలు. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన బిగ్ రివీల్ ఈవెంట్లో ఈ సినిమాను 3డీ ఫార్మాట్లోనూ విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఇందులో భాగంగా ‘అఖండ 2’ 3డీ టీజర్‌ని కూడా విడుదల చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘బాలకృష్ణగారి అభిమానులకు గొప్ప అనుభూతినివ్వాలనే తలంపుతోనే ఈ సినిమాను 3డీ ఫార్మాట్లోనూ తెస్తున్నాం. ఈ సినిమాను త్రీడీలో చూసి అద్భుతంగా ఫీల్ అవుతారు. ప్రపంచదేశాల్లో మతం కనిపిస్తుంది. మన దేశంలో మాత్రమే ధర్మం కనిపిస్తుంది. దాని ఆధారంగా తీసిన సినిమా ఇది.
ఇంటిల్లిపాదినీ ఈ సినిమాతో ఆనందింపజేసే బాధ్యత నాది. ఇది నేను మీకిస్తున్న హామీ. దేశమంతా చూడాల్సిన సినిమా కాబట్టే ప్రచారం ముంబై నుంచి మొదలుపెట్టాం. భగవద్గీత, రామాయణం, భారతం ఈ మూడింటి ఆత్మే ‘అఖండ 2.” అన్నారు. విజువల్‌గా అందరికీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ‘అఖండ 2’ అని నిర్మాత గోపీ ఆచంట చెప్పారు. ఇంకా డీఓపీ సంతోష్, ఏస్ త్రీడీ రాజు, ఎడిటర్ తమ్మిరాజు, కమెడియన్ రచ్చ రవి కూడా మాట్లాడారు.