‘ఖుషి’ నా లైఫ్‌లో మెమరబుల్ మూవీ. ఇందులో ఫస్టాఫ్‌లో లవర్‌బోయ్‌లా, సెకండాఫ్‌లో పెళ్లయిన వ్యక్తిగా కనిపిస్తా. పళ్లైనవాడిగా చేయడం ఇదే ప్రథమం. ‘ఖుషి’లో ఎమోషన్స్, రొమాన్స్, యాక్షన్ అన్నీ ఉన్నా.. ఇందులో ఉండే కామెడీనే ప్రేక్షకులు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. ఫస్టాఫ్‌లో వెన్నెల కిశోర్ కామెడీ. సెకండాఫ్ రాహుల్ రామకృష్ణ కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ‘మహానటి’ తర్వాత సమంతతో కలిసి నటించాను. మా ఇద్దరి కెమిస్ట్రీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.. ఈ సినిమాకు విషయంలో దర్శకుడు శివ నిర్వాణతో కనెక్ట్ కావడానికి నాకు నెలరోజులు పట్టింది. ఏదైనా నచ్చని విషయం ఉంటే మొహంమీదే నచ్చలేదని చెప్పేవాడిని. ఓసారి సమంత ఈ విషయంపై నాతో మాట్లాడింది. ‘ఏం చెప్పాలన్నా ఓ పద్ధతి ఉంటుంది. అలా మొహంమీద చెప్పకూడదు’ అని సలహా ఇచ్చింది.
శివ క్లారిటీవున్న దర్శకుడు
దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఉన్న దర్శకుడు. ఏదైనా సలహా నచ్చితే తీసుకుంటాడు. మొదట్లో సలహాలిచ్చేవాడిని. అతడి గురించి పూర్తిగా అర్థమయ్యాక డెసిషన్ అతనికే వదిలేశా. సమంత చాలా తెలివైన అమ్మాయి. దర్శకుడు శివ, నేను సినిమా గురించి చర్చించే సమయంలో తను మంచి ఐడియాస్ అందించేది. సమంత, నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చినందుకే అనుకుంటా మా ఆలోచనలు ఒకేలా ఉంటాయి. నాకు తెలియని విషయాలను సమంతను అడిగి తెలుసుకునేవాడిని. మా ఇద్దరికి హిస్టరీ అంటే చాలా ఇష్టం. సమంత దేవుడిని నమ్ముతుంది. అలాంటి మతపరమైన విషయాల్లో ఆమెను అడిగి సందేహాలు తీర్చుకునేవాడిని.
నా ఫ్యాన్స్ చాలా మంచోళ్లు
‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా యూసఫ్‌గూడలోని ఓ థియేటర్లో చూశా. నా సీన్స్ వచ్చినప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’ కూడా ప్రేక్షకుల మధ్యలోనే చూశా. నిజంగా అది గొప్ప అనుభవం. ఫ్యాన్స్ పెరగడం వల్ల ‘అర్జున్‌రెడి’్డ దగ్గర్నుంచి థియేటర్లో సినిమా చూడలేకపోతున్నా. నా ఫ్యాన్స్ చాలా మంచోళ్లు. ‘లైగర్’ ఫ్లాప్ అయినప్పుడు వాళ్లు చాలా ఫీలయ్యారు. ‘అన్నా మనం గట్టిగా కొట్టాలన్నా’ అని ఫోన్లు చేసేవాళ్లు. వారందరి ముఖాల్లో సంతోషం చూసేందుకు ‘ఖుషి’తో హిట్ కొట్టబోతున్నాం.
భవిష్యత్తులో దర్శకత్వం
దర్శకత్వంపై నాకు ఆసక్తి ఉంది. కొద్ది కాలం తర్వాత నటన నుంచి బ్రేక్ తీసుకొని డైరెక్షన్ చేయాలనుకుంటున్నా. అయితే నా దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్ చూస్తున్నప్పుడు నటనకు బ్రేక్ తీసుకోవడం కష్టమనిపిస్తున్నది. భవిష్యత్తులో తప్పకుండా డైరెక్షన్ చేస్తా. నాకు ప్రయాణాలు, క్రీడలు చాలా ఇష్టం. ఈ మధ్య మాల్దీవ్స్ వెళ్లాను. ఓ స్వర్గంలా అనిపించింది. ‘ఖుషి’ షూటింగ్ టైమ్‌లో కశ్మీర్ వెళ్లాను. అది నా ఫేవరేట్ ప్లేస్‌లా మారింది. నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఇష్టం. అలాగే బిజినెస్ గురించి కూడా ఆలోచనలున్నాయి. ఈ విషయంలో నా నుంచి త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ రాబోతున్నది.
తమిళ డైరెక్టర్స్‌తో చేస్తున్నా
సోషియో ఫాంటసీ జానర్ నాకు చాలా ఇష్టం. అలాంటి కథ వస్తే తప్పకుండా నటిస్తా. తమిళ్ డెరెక్టర్స్ అరుణ్ మాథేశ్వరన్, అరుణ్ ప్రభు ఇద్దరితో సినిమాలు చేయబోతున్నా. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నా సినిమా తప్పకుండా ఉంటుంది. ఎప్పుడనేది మాత్రం చెప్పలేను. ఎమోషన్స్.. రొమాన్స్.. యాక్షన్.. కామెడీ.. ఈ నాలుగు బావుంటే సినిమా పక్కా హిట్. సమంతతో కలిసి తాను నటించిన‘ఖుషి’ సినిమాలో అవన్నీ పుష్కలంగా ఉన్నాయంటున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికల ద్వారా అభిమానులతో ముచ్చటించిన విజయ్ దేవరకొండ వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విశేషాలను పంచుకున్నారు.
అలాంటి భాగస్వామి కావాలి
నేను జయాపజయాలను ఒకేలా చూస్తాను. ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి. నా దృష్టిలో జీవితం అంటే ఓడటం, గెలవడం కాదు. మన కలల సాకారం కోసం గమ్యం వైపు అడుగులు వేయడమే. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునే జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటున్నా. నేను వృత్తిపరంగా బిజీగా ఉంటే నా వ్యక్తిగత జీవితాన్ని గుర్తు చేసే భార్య కావాలి. పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఆ సమయం వస్తే నా పెళ్లి హంగులు, ఆర్భాటాలకు దూరంగా సింపుల్‌గా జరగాలని కోరుకుంటున్నా. జీవితం తాలూకు కష్టాల గురించి నాకు బాగా తెలుసు. అన్నింటి నుంచి బయటపడి సౌకర్యవంతంగా జీవితాన్ని గడపాలనే కల ఉండేది. ధైర్యంగా ప్రయత్నాలు చేస్తేనే మన కలలు సాకారం అవుతాయి. జీవితంలో డబ్బుతో పాటు గౌరవం కూడా ముఖ్యమే. నన్ను ఎవరైనా అగౌరవంగా చూస్తే అస్సలు క్షమించను.