వృత్తిపరంగా ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికైనా సదా సిద్ధంగా ఉంటానని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. పెద్ద బాధ్యతల్ని స్వీకరించి విజయాల్ని అందుకోవడంలోనే గొప్ప సంతృప్తి ఉంటుందని పేర్కొంది. దాదాపు దశాబ్దంపైగా తెలుగు, తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా భాసిల్లుతున్న ఈ చెన్నై సోయగం ఈ మధ్యే ‘ది ఫ్యామిలీ మాన్-2’ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. పాన్ ఇండియా ఇమేజ్ తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో ప్రయోగాత్మక పాత్రలు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించిందని ఆనందం వ్యక్తం చేసింది సమంత.
తెలుగు, తమిళ చిత్రాలతో పాటు ‘ది ఫ్యామిలీ మెన్-2’ సిరీస్ ద్వారా పాన్ ఇండియా నటిగా పేరు తెచ్చుకోవడం గర్వంగా అనిపిస్తోంది. అదే సమయంలో నటిగా నాపై మరింత బాధ్యత పెరిగిందనుకుంటున్నా. సవాళ్లను స్వీకరించడానికి నేనెప్పుడూ సిద్ధం గా ఉంటా. సినీ ప్రయాణంలో ఎన్నో కష్టనష్టాలు ఎదురైనా ఏనాడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. సులభమైన మార్గాల్ని ఎం చుకొని గమ్యాన్ని చేరుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. కష్టాలు ఎదురైనప్పటికీ సవాళ్లతో కూడిన రహదారిపైనే పయనం సాగిస్తా.
విమర్శలకు సమాధానమిస్తా
సినీ తారలపై విమర్శలు, పొగడ్తలు రావడం చాలా సహజం. అయితే సోషల్‌మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను నేను ఈజీగా తీసుకోను. ఎందుకంటే అవి మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అకారణంగా చేసే విమర్శలకు ధీటుగా బదులిస్తుంటాను. నేను ధరించే దుస్తులు, వృత్తిపరమైన అంశాలపై ఎవరైనా కామెంట్స్ చేస్తే తప్పకుండా ప్రతిస్పందిస్తాను. ఎదుటివారు సంధించే ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానముంటుంది. ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు ట్రోల్స్‌ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు సహకారంతో వాటిపై పోరాటం చేయాలి.
సవాళ్లకు సిద్ధం
చిత్రసీమలో విజయవంతంగా పదకొండేళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్నా. కష్టపడే తత్వమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందనుకుంటున్నా. అయితే ఈ ప్రయాణంలో అపోహలు, అనుమానాలతో సతమతమైన రోజులు చాలానే ఉన్నాయి. కాలక్రమేణా నాలోని బలహీనతల్ని, అభద్రతాభావాన్ని ఎలా జయించాలో నేర్చుకున్నా. ఇప్పుడు నేను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉన్నా. నాలోని భయాల్ని అధిగమించాను కాబట్టి ఎంత పెద్ద సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా.
మంచి కథలకే ప్రాధాన్యత
కెరీర్ తొలినాళ్లలో సినిమా కథ నచ్చితే అంగీకరించేదాన్ని. సినిమా విజయం గురించి కథ విన్నప్పుడే తెలిసిపోయేది. ఆ తర్వాత కొన్నాళ్లకు నటిగా నా ప్రాధామ్యాలు మారాయి. ప్రస్తుతం సినిమా జయాపజయాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా అభినయపరంగా సవాళ్లు విసిరే స్క్రిప్ట్స్‌ను ఎంచుకుంటున్నా. నటిగా నా ప్రతిభాసామర్థ్యాల్ని మరింత విస్తృత పరచుకునే కథల గురించి అన్వేషిస్తున్నా.
మరిన్ని మహిళా చిత్రాలు రావాలి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహిళా ప్రధాన ఇతివృత్తాల ఒరవడి ఎక్కువైంది. నా దృష్టిలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సూపర్‌హీరోలను తలపించేలా ఉండాలని కోరుకుంటా. కథానాయికను అత్యంత ధైర్యసాహసాలు మూర్తీభవించిన మహిళగా చూపించడాన్ని ఇష్టపడతాను. అయితే మనదగ్గర మహిళా ప్రధాన చిత్రాలనగానే తొలుత కథానాయికను బలహీనురాలిగా చిత్రిస్తూ అనంతరం లక్ష్యసాధనలో ఆమె విజయం సాధించినట్లుగా చూపిస్తారు. అలా కాకుండా మహిళల్ని శక్తిసంపన్నులుగా ఆవిష్కరిస్తే స్ఫూర్తివంతంగా ఉంటుంది. భారతీయ సినిమాలో మరిన్ని మహిళా ప్రధాన చిత్రాలు రావాలని కోరుకుంటున్నా.
చెన్నైతో ప్రత్యేక అనుబంధం
కరోనా లాక్డౌన్ల వల్ల నా సొంత నగరం చెన్నైకు వెళ్లడం బాగా తగ్గిపోయింది. చెన్నై నగరంతో నాకు ఎన్నో మధురజ్ఞాపకాలున్నాయి. అంతకుముందు ప్రతి మూడునెలలకొకసారి చెన్నైకు వెళ్లేదాన్ని. మిత్రుల ఇంటికి వెళ్లి అక్కడే కాలక్షేపం చేయడం సరదాగా అనిపించేది. కాలేజీ రోజుల్లో మా మిత్ర బృందం ఎక్కువగా బీచ్‌లో సేదతీరేవాళ్లం. గత కొన్ని సంవత్సరాలుగా చెన్నై బీచ్‌ను మిస్సవుతున్నా. ముఖ్యంగా నాకు చెన్నైలో దొరికే అల్పాహారం చాలా ఇష్టం.
తమిళంలో కంఫర్ట్‌గా ఫీలవుతా
తమిళం మాతృభాష కాబట్టి తమిళ సినిమా చేస్తున్నప్పుడు భాషాపరంగా ఎలాంటి ఇబ్బంది అనిపించదు. తెలుగు భాషపై మంచి పట్టు సాధించినా..ఇప్పటికీ కొన్ని పదాలు అర్థం చేసుకోలేను. తెలుగు ఇంకా నేర్చుకునే క్రమంలోనే ఉన్నాననుకుంటున్నా.