The Girl Band | ఆమెకు పాటలంటే ప్రాణం.అంతకుమించి, తాను పుట్టిన స్త్రీ జాతి అంటే ఇష్టం. మహిళలు ఎందులోనూ తీసిపోరని ప్రపంచానికి చాటిచెప్పాలని తపిస్తారు. అదే లక్ష్యంతో అచ్చంగా ఆడపిల్లలతో ‘ద గర్ల్ బ్యాండ్’ స్థాపించారు. మగవాళ్ల ఆధిపత్యం ఉన్న బ్యాండ్ కల్చర్‌లో డ్రమ్స్ నుంచి వోకల్ దాకా అన్నింటా అమ్మాయిలే కనిపించడం ఓ సంచలనం. ఈ మ్యూజిక్ ముఠా కనుక రంగంలో దిగితే.. పార్టీ అయినా, పండుగ అయినా బ్యాండ్ బాజా మోగాల్సిందే. దీని స్థాపన, నిర్వహణ వెనకున్న ఆసక్తికర సంగతుల్ని కమెడియన్,సింగర్ స్నిగ్ధ ‘జిందగీ’తో పంచుకున్నారిలా..
అమ్మాయిలు ఏ విషయంలోనూ తక్కువ కాదు. ఇది అబ్బాయిల పని, ఇది అమ్మాయిల పని అనే భేదం లేనేలేదు. ఆ తేడా మనం సృష్టించిందే. నన్ను చూసిన వారికి, నాతో మాట్లాడిన వారికి ఆ విషయం మరింత బాగా తెలుస్తుంది. నిజానికి నేను చాలా మందికి నటిగానే పరిచయం. గాయనిగా తెలిసింది తక్కువనే చెప్పాలి. నేను బయట ఎలా ఉంటానో, ఎలా మాట్లాడతానో, ఎలా ప్రవర్తిస్తానో.. స్క్రీన్ మీదా అలానే ఉంటాను, ఉండాలనుకుంటాను కూడా. అందుకే, సినిమాల విషయంలోనూ అలాంటి పాత్రలనే ఎంచుకుంటాను. డైరెక్టర్లు కూడా ఆ తరహా క్యారెక్టర్లే ఇస్తారు. నా స్వభావానికి తగిన డైలాగులే రాస్తారు. అయితే, నటన కంటే కూడా నాకు పాటలంటే ఇష్టం. అదే నన్ను ‘ద గర్ల్ బ్యాండ్’ స్థాపనకు పురిగొల్పింది.
Snigdha1
పిన్ని దగ్గరి నుంచి…
మా కుటుంబానికి తొలి నుంచీ సంగీతం పట్ల ప్రత్యేక అభిమానం. రాజమండ్రిలో గురువులు ఇంటికే వచ్చి మా పిన్నివాళ్లకు సరిగమలు నేర్పేవారు. వాళ్లతోపాటు నేనూ పాడేదాన్ని. స్కూలు, కాలేజీ రోజుల్లో కూడా పాటల పర్వం కొనసాగింది. అయితే, ప్రత్యేకించి కార్యక్రమాల కోసం పాడింది మాత్రం ఉద్యోగంలో చేరాకే. ఎంబీఏ తర్వాత కొలువు కోసం చెన్నై వెళ్లాను. ప్రముఖ గాయకుడు జి. ఆనంద్ వాళ్ల అబ్బాయి అక్కడ నా సహోద్యోగి. ఆయన ద్వారా చాలా మంది గాయకులు పరిచయం అయ్యారు. రకరకాల కచేరీలు చేసేదాన్ని. ఏఆర్ రెహమాన్‌గారి చెల్లెలు రెహానాతో కలిసి పనిచేసే అవకాశమూ లభించింది. అప్పుడే, ‘స్వరమాధురి’ కార్యక్రమంలో పాల్గొన్నాను. తొలిసారి పెద్ద వేదిక మీద పాడాను.
అక్కడ ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడే అవకాశం వచ్చింది. ఆ రోజు నా ఆనందానికి అవధుల్లేవు. ఆ తర్వాత ‘సంభవామి యుగేయుగే’ సినిమా కోసం పాడాను. కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాను. ఇంకో రెండు సినిమాలకు సంతకం పెట్టాను. నిజానికి నాకు ఆడామగా భేదం ఎప్పుడూ లేదు. కానీ ఏ కన్సర్ట్ చేసినా డ్రమ్మర్ అనగానే మగవాళ్లే కనిపించేవారు. కీబోర్డ్, గిటార్ కూడా వాళ్లే వాయించేవారు. ఒకానొక సందర్భంలో.. ‘ఆడపిల్లలు ఇవన్నీ చేయలేరా’ అనే ఆలోచన వచ్చింది. అలా ప్రాణంపోసుకున్నదే ‘ద గర్ల్ బ్యాండ్’. తొలుత దీనికి ‘ప్రెట్టీ కోట్స్’ అని పేరు పెట్టాం.
తక్కువే అయినా..
అచ్చంగా అమ్మాయిలతో బ్యాండ్ ఏర్పాటు చేసే ముందు మార్కెట్లో చాలా రీసెర్చ్ చేశాను. ఎంతోమందితో మాట్లాడాను. చాలామందికి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడంలో ప్రవేశం ఉంటుంది. ప్రొఫెషనల్‌గా ప్లే చేసేవారు మాత్రం తక్కువ. కానీ, నా ప్రయత్నం విఫలం కాలేదు. రెహమాన్ ఇన్స్టిట్యూట్లో డ్రమ్స్ నేర్చుకున్న అదీన దొరికింది. ఆమె డ్రమ్స్ ప్లే చేస్తుంటే ఎవరైనా కన్నార్పకుండా చూడాల్సిందే. అతుల్య కీబోర్డు చక్కగా వాయిస్తుంది. సోనియా, ప్రియాంక గిటార్ అలవోకగా ఆడించేస్తారు. శాక్సాఫోన్, ఫ్లూట్ కోసం ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. అలా మొత్తం మా బృందంలో అందరూ అమ్మాయిలే. పిలిచిన వాళ్ల ఇష్టాన్ని బట్టి ఏయే పరికరాలను కలిపి పాడితే బాగుంటుందో నిర్ణయించుకుని షోస్ చేస్తుంటాం. నేను పియానో నేర్చుకున్నా. గిటార్ కూడా నేర్చుకుంటున్నా.
Snigdha2
అదే తేడా..
సాధారణంగా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అమ్మాయిలు కీబోర్డు వాయించొచ్చు. ఫర్వాలేదు. కన్నవాళ్లు ప్రోత్సహిస్తారు. కానీ, వేదిక మీద పదిమందీ చూస్తుంటే.. కీబోర్డు ప్లే చేస్తే మాత్రం ఆనందించి చప్పట్లు కొట్టే తల్లి దండ్రులు తక్కువ. ‘మా అమ్మాయి పియానో ప్లే చేస్తుంటుంది, మా అమ్మాయి డ్రమ్స్ వాయిస్తుంటుంది’ అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఆమెను చేసుకునేవాడు ఎలా ఫీల్ అవుతాడో అని భయపడతారు. అందుకే నేను గుర్తించిన ఆ కొద్దిమందినీ స్టేజీ ఎక్కించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. వాళ్ల ఇంట్లో వాళ్లతో మాట్లాడి ఒప్పించాల్సి వచ్చింది. ఆడపిల్లల పట్ల సమాజ దృష్టికోణం మారితే ఇలాంటి బ్యాండ్లు ఎన్నో రావచ్చు. ఆ మార్పు కోసమే ఎదురుచూస్తున్నా.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో…
నాకు కిరణ్‌బేడీ స్ఫూర్తి. అందుకే ఆమెలా ఉండాలనుకుంటా. షూటింగ్ మీద కూడా మంచి పట్టు సాధించా. గన్ అంటే చాలా ఇష్టం. మిలిటరీ శిక్షణకూ వెళ్లాను. కానీ ఆరోగ్య కారణాల వల్ల కొనసాగించలేక పోయాను. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ బాగా ఆడేదాన్ని. నా లుక్ విభిన్నంగా ఉండటం వల్ల తరచూ సరదా సంఘటనలు జరుగుతుంటాయి. ఓ సారి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో నేను లేడీస్ వాష్‌రూమ్ వైపు వెళ్లడం చూసి ఎక్కడో దూరంగా ఉన్న సెక్యూరిటీ గార్డు సా… ర్… అంటూ పరిగెత్తుకొచ్చి ఆపాడు. తర్వాత అవాక్కవడం అతని వంతు అయ్యింది.
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి