సినీరంగంలో కొన్ని కాంబినేషన్లు ఎవర్గ్రీన్. వాటిలో నాగార్జున-టబు జోడీ ఒకటి. ‘నిన్నే పెళ్లాడతా’ ‘ఆవిడా మా ఆవిడే’ చిత్రాల ద్వారా వీరిద్దరు హిట్‌పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యక్తిగతంగా కూడా ఎన్నో ఏళ్లుగా ఇద్దరి మధ్య చక్కటి స్నేహసంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున వందో చిత్రంలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటించనుందని ప్రచారం జరుగుతున్నది.
ఈ విషయమై నాగార్జున తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. తన వందో సినిమా గురించి తెలుసుకొని అందులో నటించడానికి టబు ఆసక్తికనబరుస్తున్నదని చెప్పారు. టబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్ల నుంచి తనకు మంచి మిత్రురాలని నాగార్జున గుర్తు చేశారు. తన వందో సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రత్యేకంగా ఉంటాయని, ఎలాంటి గ్రాఫిక్స్ ఉపయోగించకుండా రియల్ ఫీల్‌తో తెరకెక్కించబోతున్నామని తెలిపారు.
ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులొచ్చాయని, వాస్తవికతకు దగ్గరగా ఉండే చిత్రాల్ని బాగా ఇష్టపడుతున్నారని నాగార్జున అభిప్రాయపడ్డారు. నాగార్జున వందో చిత్రానికి ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. తమిళ దర్శకుడు రా.కార్తీక్ రూపొందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్నది. ఇందులో ముగ్గురు కథానాయికలుంటారని, టబు కీలకమైన అతిథి పాత్రలో నటించే అవకాశం ఉందని సమాచారం.