అగ్ర హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’, ధనుష్ ‘కుబేరా’ సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. ఆ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. ‘నా సామిరంగ’ తర్వాత సోలో హీరోగా ఆయన నుంచి సినిమా రాలేదు. దాంతో సోలో హీరోగా ఆయన నటించే సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నాగ్ కూడా గత కొన్ని నెలలుగా కథలు వినే పనిలోనే ఉన్నారట. చాలామంది దర్శకులు ఆయనకి కథలు వినిపించారట. వారిలో దర్శకుడు శైలేష్ కొలను చెప్పిన కథకు నాగ్ లాక్ అయ్యారని ఫిల్మ్ వర్గాల సమాచారం. బీహార్లో జరిగిన ఓ హత్య ఘటన ఆధారంగా శైలేష్ రాసుకున్న క్రైమ్ థ్రిల్లర్ ఇదని తెలుస్తున్నది.
ఈ కథ నాగార్జునకు బాగా నచ్చిందట. ఆయన పాత్రను శైలేష్ చాలా శక్తిమంతంగా డిజైన్ చేశారని సమాచారం. ప్రస్తుతం శైలేష్ ‘హిట్ 3’ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ హడావిడి తగ్గాక నాగ్ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలుపెడతారని తెలుస్తున్నది.