Nagarjuna | దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతీఏటా నిర్వహించబడే “అలయ్ బలయ్” ఉత్సవం ఈ సంవత్సరం అత్యంత వైభవంగా జరుగుతోంది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలోని అలయ్ బలయ్ ఫౌండేషన్ 2025లో ఈ ఉత్సవాన్ని 20వ సారి ఘనంగా నిర్వహిస్తోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, జాతీయ సేవలో ప్రాణాలు అర్పించిన వీరులకు గౌరవం తెలుపుతూ ఈ ఉత్సవం సాగనుంది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మండవియా, కేంద్ర గనులు, కట్టడాల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సినీ నటుడు నాగార్జునకి కూడా ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా సినీ నటుడు అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, “ఇలాంటి సత్కార కార్యక్రమానికి నేను తొలిసారి రావడం ఎంతో సంతోషంగా ఉంది. బండారు దత్తాత్రేయ గారు గత 20 ఏళ్లుగా అన్ని రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఇది మాకు ఎంతో గౌరవం, ఉత్సాహాన్నిస్తుంది. ఇలాంటి అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించిన విజయలక్ష్మి గారికి నా అభినందనలు. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు” అని అన్నారు.
అలయ్ బలయ్ కార్యక్రమం విశిష్టత ఏమంటే, ఇది రాజకీయాలను మరిచిపోయి మానవీయత, విలువల పరంపరను కొనసాగించే వేదికగా నిలుస్తుంది. ప్రజా ప్రతినిధులు, సినీ ప్రముఖులు, సేవా సంస్థల ప్రతినిధులు, కళాకారులు ఇలా అన్ని రంగాల వారిని ఒకచోట కలిపే ఈ కార్యక్రమం. ప్రతి ఏడాది ఎంతో అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమం ఈ సారి కూడా గ్రాండ్‌గానే జరగనుంది.