సుదీర్ఘ నట ప్రయాణంలో వందో సినిమా మైలురాయిని చేరుకున్నారు అగ్ర నటుడు అక్కినేని నాగార్జున. ఈ ప్రస్థానంలో ఎన్నో మెమొరబుల్ హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. ప్రయోగాత్మక సినిమాలతో సెల్యూలాయిడ్ సైంటిస్ట్ అనే ఇమేజ్ను సృష్టించుకున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున వందో సినిమా తాలూకు అప్డేట్ గురించి ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్‌తో తాను వందో చిత్రాన్ని చేయబోతున్నానని గతంలోనే ప్రకటించారు నాగార్జున. తాజా సమాచారం ప్రకారం దసరా పర్వదినం సందర్భంగా ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు తెలిసింది.
ఈ సినిమాకు ‘100 నాటౌట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. కెరీర్లో స్పెషల్ మూమెంట్ అయిన ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని సమాచారం. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన కథాంశమిదని, ఈ సినిమాలో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. భారీ వ్యయంతో స్వీయ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.