హీరోగా వంద సినిమాలు పూర్తిచేయడమంటే చిన్న విషయంకాదు. చిరంజీవి 150వ మార్క్ కూడా దాటేస్తే, బాలకృష్ణ వంద మార్కును దాటేసి దూసుకుపోతున్నారు. వీరిద్దరి తర్వాత వంద సినిమాకు చేరువలో ఉన్న హీరో అక్కినేని నాగార్జున. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘నా సామిరంగ’ నాగ్ 99వ సినిమా. విజయ్ బిన్నీ దర్శకుడు. ఈ సినిమా తర్వాత ఆయన 100వ సినిమా లైన్లోకి వస్తుంది. వందవ సినిమా అంటే ఏ హీరోకైనా ప్రతిష్టాత్మకం. సుదీర్ఘమైన సినీ ప్రస్థానం ఉన్న హీరోలు మాత్రమే ఆ క్రెడిట్ సాధించగలరు.
ఏ హీరో అయినా తన వందవ సినిమా మరపురాని హిట్‌గా నిలవాలనే కోరుకుంటాడు. ఇప్పుడు నాగ్ వంతు వచ్చింది. 37ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు, ఆటుపోట్లు చూశారు నాగార్జున. సూపర్‌స్టార్ కొడుకుగా తేలిగ్గా ఎంటరైనా, హీరోగా తన స్థానాన్ని నిలబెట్టుకోటానికి ఆయన పడ్డ కష్టం సాధారణమైంది కాదు. ఎట్టకేలకు వంద సినిమాల మైలురాయికి చేరుకున్నారు నాగ్.
మరి ‘నాగ్ 100’వ సినిమాకు దర్శకుడెవరు? ఇది ఇప్పుడు ఫిలిం వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న. మొన్నటివరకూ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ సినిమాను డైరెక్ట్ చేసిన మోహన్‌రాజా పేరు బాగా వినిపింది. అయితే.. ఉన్నట్టుండి ఇప్పుడు మరో తమిళ దర్శకుడి పేరు బలంగా వినిపిస్తున్నది. అతని పేరు నవీన్. ఇప్పటివరకూ నవీన్ రెండు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. వాటి ఫలితం ఎలా ఉన్నా, నాగార్జునకి తను చెప్పిన లైన్ మాత్రం బాగా నచ్చిందంట. దాంతో బౌండ్ స్క్రిప్ట్‌తో రమ్మన్నారట నాగ్. మరి ఈ వార్తలో నిజం ఎంతవరకో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.