Nagabandham Review | సినిమా నిర్మాణ దశ నుంచే తెలుగు ఆడియెన్స్‌లో ఎంతో ఆసక్తిని రేకెత్తించిన చిత్రం నాగబంధం. భారీ గ్రాఫిక్ హంగులతో విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. డివైన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటించగా, అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
కథ
అనాథ అయిన రుద్ర (విరాట్ కర్ణ)ను పద్మమ్మ (శరణ్య) చేరదీసి సొంత కొడుకులా పెంచుతుంది. తన చెల్లెలి (సోనియా సింగ్) పెళ్లిని రాజు అనే యువకుడితో ఘనంగా చేయాలని రుద్ర అనుకుంటాడు. సరిగ్గా పెళ్లి సమయంలో రంగనాథ స్వామి ఆలయంలోని బ్రహ్మకమలం కోసం రుద్ర కుటుంబంపై జుల్ఫికర్ అలీ (రిషబ్) దాడి చేస్తాడు. ఈ ప్రమాదంలో రుద్ర ఫ్యామిలీలోని అందరూ చనిపోతారు. వేల ఏళ్లుగా రంగనాథ స్వామి ఆలయంలో పూజలందుకుంటున్న బ్రహ్మకమలంతో రుద్రకు ఉన్న సంబంధం ఏమిటి? ఆ బ్రహ్మకమలాన్ని దొంగతనం చేయాలని ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్ (జగపతిబాబు)తో పాటు అతని కూతురు పార్వతి (నభా నటేష్) ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఆలయంలోని బ్రహ్మకమలం, గరుడ మంత్రాలతో పాటు నాగబంధం గ్రంథం సాయంతో అమరత్వం పొందాలని జుల్ఫికర్ అలీ, భైరాగి (గరుడ రామ్) ఎలాంటి మారణహోమానికి పాల్పడ్డారు? కైలాస పర్వతంలోని విరాటస్వామి ఆలయంలోని ఓ గదిలో ఉన్న రహస్యం ఏమిటి? 17వ శతాబ్దంలో హిందూ దేవాలయాలను దోచుకున్న అబ్దాలీని నాగసాధువు ఎలా నిలువరించాడు? అన్నదే నాగబంధం మూవీ కథ.
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి నాగబంధం రక్షణగా ఉందనే కథ ప్రచారంలో ఉంది. ఆ నాగబంధాన్ని విచ్ఛిన్నం చేయాలంటే గరుడ మంత్రాలు తెలిసి ఉండాలని పురాణాల్లో రాసి ఉంది. ఈ పాయింట్ నుంచే దర్శకుడు అభిషేక్ నామా స్ఫూర్తి పొంది నాగబంధం కథను రాసుకున్నారు. ఈ చిన్న పాయింట్‌కు సనాతన ధర్మం, హైందవ సంస్కృతితో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్‌స్టోరీని జోడించి సినిమాను రూపొందించారు.
విశ్లేషణ
నాగబంధం విముక్తి కోసం ప్రయత్నించే అసాంఘిక శక్తులు, దేవుడి అండతో వారిని ఎదుర్కొనే సామాన్యుడైన హీరో.. ఈ అంశాల చుట్టే నాగబంధం కథ సాగుతుంది. ఈ సింపుల్ పాయింట్‌ను విజువల్ ట్రీట్‌లా వెండితెరపై ఆవిష్కరించాడు డైరెక్టర్. ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్గా ఉంటుంది. అబ్బురపరిచే సెట్స్, అదిరిపోయే గ్రాఫిక్స్ లార్జర్ దేన్ లైఫ్లాంటి అనుభూతిని అందిస్తాయి. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. భైరవకోన ఎపిసోడ్, మానసాదేవి టెంపుల్లో జరిగే ఫైట్‌తో పాటు అబ్దాలీ మనుషులకు, నాగసాధువులకు మధ్య జరిగే వార్ సీన్లు గూస్బంప్స్ కలిగిస్తాయి. అయితే యాక్షన్ సీక్వెన్స్‌లు సుదీర్ఘంగా సాగడం మాత్రం సినిమాకు మైనస్‌గా మారింది. నాగబంధం కథను మొదలుపెట్టిన తీరు బాగుంది. విలన్ల లక్ష్యం ఏమిటి? హీరోకు ఏదో ఫ్లాష్‌బ్యాక్ ఉందన్నది ఆరంభంలోనే చెప్పేశారు. ఆ తర్వాతే దర్శకుడు ట్రాక్ తప్పాడు. ఫ్యామిలీ సీన్లు కథకు పెద్దగా అతకలేదు. కథ మొత్తం బ్రహ్మకమలం చుట్టే తిరగడంతో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే పాటలు కథ ఫ్లోను దెబ్బతీశాయి. లవ్‌స్టోరీని అయినా సరిగ్గా చూపించాడా అంటే అదీ లేదు. చివర్లో హిందుత్వం, సనాతన ధర్మం గురించి హీరో చెప్పే డైలాగ్స్ కూడా సోసోగానే అనిపిస్తాయి.
నటీనటులు
రెండు డిఫరెంట్ షేడ్స్‌తో సాగే పాత్రలో హీరోగా విరాట్ కర్ణ మెప్పించాడు. నాగసాధువుగా అతని లుక్ బాగుంది. యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించినా, ఎమోషనల్ సీన్ల పరంగా ఇంకా పరిణితి చూపించాల్సి ఉంది. నభా నటేష్‌కు మంచి రోల్ దక్కింది. పాజిటివ్, నెగెటివ్ కోణాల్లో ఆమె పాత్ర సాగుతుంది. కొద్దిసేపు డ్యూయల్ రోల్లో కనిపిస్తుంది. విలన్‌గా రిషబ్ డైలాగ్ డెలివరీ, బాడీలాంగ్వేజ్ విభిన్నంగా ఉన్నాయి. మరో హీరోయిన్ ఐశ్వర్య మీనన్‌కు ఒకటి రెండు డైలాగ్స్ తప్ప పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. జగపతిబాబు, మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, శరణ్య, అనసూయ, సోనియా సింగ్, అంకిత్ కొయ్యతో పాటు సినిమాలో చాలామందే యాక్టర్లు కనిపిస్తారు కానీ, తమ నటనను చాటిచెప్పే అవకాశం ఎవరికీ దక్కలేదు.
సాంకేతికంగా
రైటర్‌గా కంటే డైరెక్టర్‌గా అభిషేక్ నామా మెప్పించాడు. విజువల్ వండర్లా సినిమాను రూపొందించాడు. మేకింగ్‌లో నిర్మాతలు అస్సలు కాంప్రమైజ్ కాలేదు. ఆ క్వాలిటీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. రంగనాథ స్వామి, విరాటదేవి, మానసాదేవి ఆలయాల సెట్స్ బాగున్నాయి. జునైద్ ఖాన్, అభిషిక్త్ కొత్తపల్లి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM)తో పాటు ‘నమోరే’ సాంగ్ బాగుంది. రన్ టైమ్ సినిమాకు పెద్ద మైనస్.
చివరిగా విజువల్స్, గ్రాఫిక్స్ పై పెట్టిన శ్రద్ధ కథపై కూడా పెట్టి ఉంటే నాగబంధం రిజల్ట్ మరోలా ఉండేది. చిన్న చిన్న లోపాలున్నా నాగబంధం ప్రేక్షకులను కొంతవరకు మెప్పిస్తుంది.
రేటింగ్ : 2.75/5