Sobhita | తెలుగమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్, కోలీవుడ్‌లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శోభిత ధూళిపాళ్ల పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ విస్తృతంగా వినిపిస్తోంది. నాగచైతన్యతో ప్రేమ, నిశ్చితార్థం, ఆపై వివాహం తర్వాత ఆమెకు మరింత పాపులారిటీ దక్కింది. గత ఏడాది డిసెంబర్లో అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్ఆర్ విగ్రహం ఎదుట కుటుంబ సభ్యుల సమక్షంలో శోభిత – నాగచైతన్య వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో పరిస్థితుల దృష్ట్యా పెళ్లి ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదు. అయితే ఈ ఏడాది తమ మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా పెళ్లి వీడియోలను అభిమానులతో పంచుకొని మరోసారి వార్తల్లో నిలిచింది శోభిత.
ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్న అక్కినేని కోడలు శోభిత, తాజాగా తమిళనాడులో నిర్వహించిన ప్రముఖ సంగీత కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చెన్నైలోని పచ్చయప్ప కాలేజ్ మైదానంలో జరిగిన “మార్గళియిల్ మక్కళ్ ఇసై” ఆరో ఎడిషన్ ముగింపు వేడుకలకు ఆమె చీఫ్ గెస్ట్‌గా హాజరైంది. ఈ కార్యక్రమం ముగింపు రోజు అయిన 2025 డిసెంబర్ 23న శోభిత పాల్గొని తన స్పీచ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సందర్భంగా శోభిత మాట్లాడుతూ, “భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఉన్న గొప్ప వారసత్వాన్ని గుర్తుచేసే ఇలాంటి కార్యక్రమాలు యువతలో సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయి. సంప్రదాయ కళలను పరిరక్షించడంలో ప్రజల పాత్ర ఎంతో కీలకం” అని పేర్కొంది. అలాగే సంగీత కళాకారులు, నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించింది.
“మార్గళియిల్ మక్కళ్ ఇసై” కార్యక్రమం జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతం, సాంప్రదాయ గ్రామీణ కళలు, నిరసన సంగీతం వంటి వివిధ సంగీత రూపాలకు వేదికగా నిలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు పా. రంజిత్ స్థాపించిన “నీలం కల్చరల్ సెంటర్” ప్రతిఏటా నిర్వహిస్తోంది. సామూహిక స్ఫూర్తి, సాంస్కృతిక గుర్తింపును ప్రోత్సహించే లక్ష్యంతో జరుగుతున్న ఈ వేడుక ఈసారి అరుదైన రికార్డు సృష్టించింది. 40,000 మందికి పైగా ప్రేక్షకులు, 500 మందికి పైగా కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ వేడుకకు దర్శకులు వెట్రిమారన్, లోకేష్ కనగరాజ్, మారి సెల్వరాజ్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, ఎంపీ కనిమొళి కరుణానిధి సహా పలువురు ప్రముఖులు హాజరుకావడం విశేషం. శోభిత ధూళిపాళ్ల స్పీచ్, ఆమె సాంస్కృతిక అంశాలపై చూపిన అవగాహనకు హాజరైనవారు ప్రశంసలు కురిపించారు.