Sobhita Dhulipala | ఇటీవలే యువ హీరో నాగచైతన్యతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది శోభితా ధూళిపాళ్ల. పెళ్లి తర్వాత దంపతులిద్దరూ కలిసి ఓ జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చైతన్యతో తన పరిచయం, ప్రేమ, పెళ్లికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను శోభితా ధూళిపాళ్ల పంచుకుంది. రెండేళ్ల క్రితం చైతన్యతో తన స్నేహం మొదలైందని, 2022 ఏప్రిల్ నుంచి నాగచైతన్యను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నట్లు శోభితా తెలిపింది. తామిద్దరం భోజనప్రియులమని, పరిచయమైన తొలిరోజుల్లో ఎక్కువగా ఫుడ్ గురించే మాట్లాకునేవాళ్లమని చెప్పింది.
చైతన్యకు తెలుగులో మాట్లాడటమంటే చాలా ఇష్టమని, తరచూ తనను తెలుగులో మాట్లాడమని కోరేవాడని శోభిత గుర్తు చేసుకుంది. ‘నేను సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటా. నా గ్లామర్ ఫొటోలతో పాటు స్ఫూర్తినిచ్చే స్టోరీలకు చైతన్య లైక్ కొట్టేవాడు. మేమిద్దరం తొలిసారి ముంబయిలోని ఓ కేఫ్‌లో కలుసుకున్నాం. ఆ తర్వాత కొన్నాళ్లకు కర్ణాటకలోని ఓ పార్క్‌కు వెళ్లాం. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌కు వెళ్లాం. అక్కడి నుంచి మా బంధం బలపడింది’ అని శోభితా ధూళిపాళ్ల తెలిపింది. ఇరు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడిన తర్వాత ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చానని, చైతూ వెంటనే అంగీకరించాడని ఆమె పేర్కొంది.