నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘తండేల్’. మత్స్యకారుల నేపథ్య కథాంశమిది. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్నది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం కర్ణాటక ఉడిపిలో ప్రారంభమైంది. సముద్రం మధ్యలో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ పార్ట్ రొమాంచితంగా ఉంటుందని చెబుతున్నారు.
ఈ సినిమా కోసం నాగచైతన్య సరికొత్త మేకోవర్‌తో సిద్ధమయ్యారు. మంగళవారం విడుదల చేసిన పోస్టర్లో నాగచైతన్య సముద్రం వైపు నడుస్తు ఆనందంగా కనిపిస్తున్నారు. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, యాక్షన్ ప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: షామ్‌దత్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.