Naga Chaitanya | హీరో నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం ఉదయం 9గం.42 నిమిషాలకు ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని అగ్ర నటుడు నాగార్జున నివాసంలో ఈ వేడుకను నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. నా కుమారుడు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈ రోజు జరిగింది. మా అక్కినేని కుటుంబంలోకి ఆమెను సాదరంగా, సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది. అలాంటి రోజున నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట జీవితం.. సంతోషంతో, ప్రేమతో నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. నూతన జంటకు నా ఆశీస్సులు’ అని నాగ్ పేర్కొన్నారు. దీనిపై నెటిజన్స్ కూడా పాజిటివ్‌గా స్పందించారు.
కొత్త జంటకు శుభాకాంక్షలు అందించారు. శోభిత, చైతూ కొంతకాలంగా స్నేహితులుగా ఉన్నారు. వీరి పెళ్లి గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది ఈ రోజు నిజమైంది. ఇక శోభిత వివరాల్లోకెళితే.. గుంటూరు జిల్లా తెనాలిలో ఆమె జన్మించింది. పెరిగింది వైజాగ్. అచ్చ తెలుగమ్మాయి. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసింది. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి 2013 ‘ఫెమినా మిస్ ఇండియా’ టైటిల్ విన్నర్‌గా నిలిచింది. 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘రామన్ రాఘవ్ 2.0’ సినిమాతో ఆమె చిత్రరంగ ప్రవేశం చేసింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్లో కూడా నటించింది. గూఢచారి, మేజర్, పొన్నియన్ సెల్వన్ చిత్రాలు ఆమెకు గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక నాగచైతన్య ‘తండేల్’ సినిమాతో బిజిగా ఉన్న విషయం తెలిసిందే.
రెండేళ్లుగా డేటింగ్: నటి సమంతతో విడాకులు తీసుకున్న అనంతరం నాగచైతన్య కొంతకాలం సింగిల్‌గానే ఉన్నారు. గత రెండేళ్లుగా శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నారు. ‘మేజర్’ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల సందర్భంలో ఈ జంట తొలిసారి కలుసుకున్నట్లు తెలిసింది.. అక్కడ చిగురించిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. గత ఏడాది ఈ జంట లండన్‌లోని ఓ రెస్టారెంట్లో కనిపించడంతో డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. జూన్‌లో విదేశాల్లో కలిసి తీయించుకున్న ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా డేటింగ్ వార్తలను నిజం చేస్తూ ఈ జంట నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నారు.