ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవానికి సమయం దగ్గర పడుతున్నది. మార్చి 12న నిర్వహించే ఈ వేడుక కోసం భారతీయ సినీ ప్రేమికులందరూ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గుమ్మం ముందు నిలిచిన ‘నాటు నాటు’ పాటకు అవార్డు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లకు ఆస్కార్ అవార్డుల వేదిక మీద లైవ్ పర్ఫార్మెన్స్ కోసం ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కీరవాణి, చంద్రబోస్ లాస్ఏంజిల్స్లో ఉన్నారు. ఆస్కార్ కమిటీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్చి 12న డాల్బీ థియేటర్ వేదికగా చేయబోతున్న లైవ్ పర్ఫార్మెన్స్ గురించి ఆసక్తికరమైన వివరాల్ని వెల్లడించారు కీరవాణి. ఇప్పటికే ‘నాటు నాటు’ పాట లైవ్ పర్ఫార్మెన్స్ కోసం రిహార్సల్స్ జరుగుతున్నాయని తెలిపారు.
కీరవాణి మాట్లాడుతూ ‘ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం భారత్ నుంచి సింగర్స్‌ను తీసుకొస్తున్నాం. నృత్య బృందాన్ని మాత్రం ఇక్కడి నుంచే ఎంపిక చేసుకుంటున్నాం. చక్కటి టీమ్ వర్క్‌తో లైవ్ పర్ఫార్మెన్స్ కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నాం’ అని అన్నారు. కీరవాణి స్వరాల్ని అందించగా, చంద్రబోస్ రాసిన ‘నాటు నాటు’ పాట ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించింది. హుషారైన బీట్, అర్థవంతమైన సాహిత్యంతో ఆకట్టుకుంది. తాజాగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్కు సిద్ధం కావడంతో సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.