Mysaa | ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంలో అమాయకమైన యువతిగా ఆకట్టుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ ‘మైసా’ (Mysaa) కోసం వెరైటీ అవతారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూతన దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన యాక్షన్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ గ్లింప్స్‌లో రష్మిక కనిపించిన విధానం ఆమె కెరీర్లోనే తొలిసారి అని చెప్పాలి. ఒళ్లంతా రక్తం, తెగిపోయిన చేతి బేడీలు, చేతిలో గన్, కళ్లలో రగిలే కోపం… ఒక గిరిజన తిరుగుబాటు యువతిగా ఆమె ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు రొమాంటిక్, ఫీల్ గుడ్, కమర్షియల్ పాత్రలతో అభిమానులను మెప్పించిన రష్మిక, ఈసారి పూర్తిగా రెబల్ యాక్షన్ మోడ్‌లోకి మారిపోయింది.
గ్లింప్స్‌లో వినిపించే వాయిస్ ఓవర్ పాత్రలోని గాంభీర్యాన్ని మరింత పెంచగా, సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అందించిన పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రాణం పోసింది. ప్రతి ఫ్రేమ్‌లో ఇంటెన్సిటీ కనిపిస్తూ, ‘మైసా’ ఓ సాధారణ యాక్షన్ సినిమా కాదని ఈ గ్లింప్స్ స్పష్టంగా చెబుతోంది. ‘మైసా’ అంటే “అమ్మ” అని అర్థం. గోండు గిరిజన తెగల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా, అన్యాయానికి ఎదురు నిలిచే ఓ సహజ నాయకురాలి కథగా ఉండనున్నట్లు తెలుస్తోంది. స్వేచ్ఛ, పోరాటం, భావోద్వేగాల మేళవింపుతో ఈ చిత్రాన్ని ఓ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా మలుస్తున్నారు.
అన్ ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రష్మికతో పాటు, ‘పుష్ప 2’లో విలన్ పాత్రతో మెప్పించిన తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, పలు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన యాక్షన్ గ్లింప్స్‌తోనే ‘మైసా’పై అంచనాలు భారీగా పెరిగాయి. రష్మిక కెరీర్లోనే అత్యంత ఫెరోషియస్, ఇంటెన్స్ పాత్రగా ఇది నిలవనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి రెబల్ అవతారంలో రష్మిక బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.