సంకల్పబలం ఉంటే జీవితంలోని ఏ దశలోనైనా అనుకున్నది సాధించవొచ్చనే చక్కటి సందేశంతో ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ చిత్రాన్ని తీశానని చెప్పారు దర్శకుడు శివ పాలడుగు. అజయ్‌ఘోష్, చాందిని చౌదరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం దర్శకుడు శివ పాలడుగు పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘మా స్వస్థలం విజయవాడ. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే దర్శకత్వం మీద అభిరుచితో డైరెక్షన్లో డిప్లొమా కోర్స్ పూర్తి చేశాను.
నా స్నేహితులే నిర్మాతలు కావడంతో అవకాశం సులభంగానే దక్కింది’ అని చెప్పారు. సంగీతం నేపథ్యంలో ‘మ్యూజిక్షాప్ మూర్తి’ కథ నడుస్తుందని, నాటి తరం గీతాలతో పాటు నేటి ట్రెండీ మ్యూజిక్‌తో పాటలు ఆకట్టుకుంటాయని తెలిపారు. ‘పాతికేళ్ల వయసులో సాధించలేని ఓ లక్ష్యాన్ని యాభై ఏళ్ల వయసులో కూడా సాధించవొచ్చనే విషయాన్ని ఈ సినిమాలో చూపించాం. అందుకోసం ఓ వ్యక్తి చేసే ప్రయత్నాలు ఎమోషనల్‌గా సాగుతాయి. అజయ్‌ఘోష్ ఈ పాత్రకు చక్కగా కుదిరాడు. చాందిని చౌదరి పాత్ర కథాగమనంలో చాలా కీలకంగా ఉంటుంది. సరికొత్త కంటెంట్‌తో ఈ సినిమా తీశాం. తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.