ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘పుష్ప2’ పాటలే వినిపిస్తున్నాయి. గురువారం విడుదలైన ఈ సినిమా విషయంలో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవిశ్రీప్రసాద్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉండేవాళ్లకు ప్రతిభతో పాటు నిజాయితీ అవసరం. నీనుంచి వచ్చే ప్రొడక్ట్ నీదని గర్వంగా చెప్పుకునేలా ఉండాలి.
‘నువ్వు చేసిన పాట, ఫలానా మూవీలోని పాటను పోలి ఉంది’ అని ఎవరైనా అంటే.. ‘నేను స్ఫూర్తి పొందాను..’ అని చెప్పడం ఇప్పుడు ఫ్యాషనైపోయింది. నాదృష్టిలో అది కూడా కాపీ కొట్టడమే. పక్కోళ్ల క్రెడిట్‌ని కొట్టేయడం క్రియేటివిటీ అనిపించుకోదు. నా కెరీర్ తొలినాళ్లలో కొందరు దర్శక, నిర్మాతలు కొన్ని సీడీలు నా ముందు పెట్టి ‘ఇలాంటి పాటలు కావాలి’ అని అడిగేవాళ్లు. ‘నేను క్రియేట్ చేయడానికి ఉన్నా కానీ.. కాపీ కొట్టడానికి లేను..’ అని వారికి నిర్మొహమాటంగా చెప్పేసేవాడ్ని.
ఇప్పటికీ అదేమాటపై కట్టుబడి ఉన్నా. కళారంగంలో ఉన్నవాళ్లకు నైతిక విలువలు అవసరం. కానీ ప్రస్తుతం అవే చాలామందిలో లోపిస్తున్నాయి. సాటి కళాకారుల అవకాశాలను లాక్కోవడం, అందుకోసం ఎంతకైనా దిగజారడం ఇప్పుడు పరిపాటైపోయింది. అవకాశాలకోసం పనిచేయడం వేరు. ఇతరుల అవకాశాలను లాక్కోవడం కోసం పనిచేయడం వేరు. మొదటిది తప్పుకాదు. రెండోది సరైనది కాదు’ అంటూ దేవిశ్రీప్రసాద్ చెప్పుకొచ్చారు.