ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. మారుతున్న ప్రతి జనరేషన్‌లోనూ మ్యూజిక్ డైరెక్టర్‌గా అగ్ర స్థానంలోనే ఉంటున్నారు దేవిశ్రీ ప్రసాద్. సంగీత దర్శకునిగా నిండా పాతికేళ్ల కెరీర్ ఆయనది. ఇంత లాంగ్విటీ ఉన్న సంగీత దర్శకులు అరుదు. అలాంటి ఈ అరుదైన సంగీత రత్నం స్వరాలందించిన తాజా చిత్రం ‘తండేల్’. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు దేవిశ్రీ.
Devi Sri Prasad | కంప్లీట్ రిస్టిక్ ఫోక్ స్టోరీకి మ్యూజిక్ ఇవ్వాలనే కోరిక నాకెప్పట్నుంచో ఉండేది. ఆ కోరిక ‘రంగస్థలం’తో తీరింది. అందులోని పాటలన్నీ జానపద మూలాల్లో నుంచి చేసినవే. నా సినిమాల్లో ఫోక్ టచ్ ఉన్న మరో సినిమా ‘ఉప్పెన’. అదొక విభిన్నమైన కంపోజిషన్. కాస్త సూఫీ ైస్టెల్లో క్లాస్ మిక్స్ చేసినట్టుగా ఆ పాటలుంటాయి. ఇప్పుడు ‘తండేల్’. ఇది కూడా ఫోక్ టచ్ ఉన్న సినిమానే. పాకిస్తాన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయిన మత్స్యకారుల కథ ఇది. రియలిస్టిక్ అంశాలతో రాసుకున్న ఈ కథలో అద్భుతమైన ప్రేమ ఉంటుంది. భావోద్వేగాలుంటాయి. కథలో అంత విషయం ఉంది కాబట్టే.. అంతమంచి పాటలు వచ్చాయి. ఇప్పటికి మూడు పాటలు విన్నారు. రాబోయే పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి.
విషయం ఉన్న కథ తేలిగ్గా మనసులోకి వెళ్లిపోతుంది. అలాంటి కథ వింటున్నప్పుడు ఆటోమేటిగ్గా ట్యూన్స్ వచ్చేస్తాయి. డైరెక్టర్ చందు ఈ కథ చెబుతున్నప్పుడే కొన్ని ట్యూన్స్ వచ్చేశాయి. ‘బుజ్జి తల్లి’ ట్యూన్ అలా వచ్చిందే. హమ్ చేస్తూ పియోనో ప్లే చేశాను. ఆ వీడియోను చందు షూట్ చేసి పోస్ట్ చేశాడు. ఆ ట్యూన్ మధ్యలో అమ్మాయి పేరు వస్తే అందంగా ఉంటుంది. అందుకు తగ్గ ప్లేస్మెంట్ కూడా ఉంది. అందుకే ‘బుజ్జి తల్లి’ అనే పదాన్ని యాడ్ చేశాం. ఈ పాట రిలీజవ్వగానే ట్రమండస్ రెస్పాన్స్ వచ్చింది. సుకుమార్ ఈ పాట విని… ‘నీ ఆల్‌టైమ్ టాప్ ఫైవ్‌లో ఉంటుంది.’ అని చెప్పారు. అలాగే శివునిపాట, హైలెస్సో పాట జనాల్లోకి బాగా వెళ్లాయి.
డైరెక్టర్ చందూ గ్రేట్ విజన్‌తో ఈ సినిమా తీశాడు. ఎమోషన్స్‌ని అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఓ రేంజ్లో ఉంటాయి. సముద్రంలో బోట్ సీక్వెన్స్ అయితే గూజ్బంప్స్ తెప్పిస్తుంది. నాగచైతన్య ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డారు. తండేల్ రాజుగా ట్రాన్సర్మేషన్ కావడానికి ఆయన తీసుకున్న శ్రమ అసాధారణం. ఇక సాయిపల్లవి అయితే ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్క్రీన్‌పై ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఆ అందం బిగ్ స్క్రీన్‌పైనే చూడాలి. అరవింద్ అంకుల్ నేతృత్వంలో బన్నీవాసు గ్రాండియర్‌గా సినిమా తీశారు. కచ్చితంగా సినిమా పెద్ద విజయం సాధిస్తుంది.
‘తండేల్’ కథ విని.. ‘మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీని ఫిక్స్ చేసుకోండి..’ అని బన్నీనే అరవింద్ అంకుల్‌కి చెప్పారట. ఆ నమ్మకాన్ని నిజం చేశాననే అనుకుంటున్నా. ఇటీవల బన్నీ నన్నొక కోరిక కోరాడు. సినిమాలో ఆరు పాటలుంటే.. ఆ ఆరూ కూడా చక్కని లవ్ మెలొడీలుగా ఉండే ఓ ప్రేమకథ చేయాలనేది తన కోరిక. ఈ విషయాన్ని ఓ పేపర్‌పై రాసి, ‘గుర్తుపెట్టుకో.. మనం అలాంటి సినిమా చేయాలి’ అని రాసిచ్చారు. అన్నీ కుదిరితే చేస్తాం..