‘మా స్వస్థలం మెదక్. సినిమాల మీద ఇష్టంతో అమెరికాలో ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాను. సమాజంలోని అసమానతల మీద సినిమా తీయాలనే ఉద్దేశ్యంలో ఈ కథ రాసుకున్నా’ అన్నారు మురళీకాంత్. ఆయన దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన ‘దండోరా’ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ ప్రధాన పాత్రధారులు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. ఈ సందర్భంగా సోమవారం దర్శకుడు మురళీకాంత్ విలేకరులతో మాట్లాడారు. చనిపోయిన తర్వాత ఖననం చేసే విషయంలో గ్రామాల్లో కొందరు ఎదుర్కొనే వివక్ష నేపథ్యంలో తనకు ఎదురైన ఓ అనుభవంతో ఈ కథ రాసుకున్నానని తెలిపారు. ‘ఓ వ్యక్తి చనిపోయిన దగ్గరి నుంచి పూడ్చి పెట్టేవరకు జరిగే కథ ఇది.
అంత్యక్రియల ఘట్టంతో సినిమా ముగుస్తుంది. ఆ వ్యక్తిని పూడ్చిపెట్టడానికి ఎందుకు అనుమతినివ్వలేదు? ఊరిలోని సమస్య ఏమిటి? దానికి పరిష్కారం దొరికిందా? లేదా? అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్. ఈ కథలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. అన్ని పాత్రలు శివాజీ క్యారెక్టర్‌కు లింక్ అయి ఉంటాయి. తొలుత ఈ సినిమాకు ‘అంతిమ యాత్ర’ అనే టైటిల్ అనుకున్నా. కానీ సౌండింగ్ పవర్‌ఫుల్‌గా ఉండాలని ‘దండోరా’ను ఖరారు చేశాం’ అని మురళీకాంత్ పేర్కొన్నారు. ఈ సినిమాలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని, హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో పాటు స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుందని, ఓ అందమైన అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికొస్తారని ఆయన తెలిపారు.