Multi Starrer | తమిళ సినీ అభిమానులకు శుభవార్త. సూపర్‌స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్లో ఓ భారీ సినిమా రాబోతోంది. చాలా కాలంగా ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే తెరపై కనిపించాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కలయికలో సినిమా రూపుదిద్దుకోబోతుందనే వార్తపై అధికారిక సమాచారం బయటకు వచ్చింది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి దర్శకుడి పేరు, షూటింగ్ ప్రారంభం వంటి వివరాలు బయటకు రాలేదు. మొదట్లో ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ప్రదీప్ రంగనాథన్ పేరు వినిపించింది. కానీ తాను ఈ ప్రాజెక్ట్‌లో లేనని ప్రదీప్ స్పష్టం చేశారు. దీంతో సినిమా జరుగుతుందా లేదా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
అయితే తాజాగా రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్, కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ చెన్నైలో జరిగిన ఒక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని త్వరలోనే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందని ధృవీకరించారు. రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్లో సినిమా తప్పకుండా తెరకెక్కుతుందని, ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించబోతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని తెలిపారు.ఇక ఇటీవల సైమా అవార్డుల వేడుకలో కమల్ హాసన్ కూడా ఈ విషయం గురించి స్పందించారు. “మేమిద్దరం కలిసి నటించాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులు మా కాంబినేషన్ చూసి సంతోషిస్తే మాకే ఆనందం. త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాం,” అని అన్నారు.
గతంలో ఈ ఇద్దరూ ‘అపూర్వ రాగంగళ్’, ‘మూండ్రు ముడిచ్చు’, ‘అంతులేని కథ’ వంటి చిత్రాల్లో కలిసి నటించి బ్లాక్‌బస్టర్ హిట్లు అందించారు. 1979లో వచ్చిన అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్ తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు.తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ ప్రాజెక్ట్‌కు జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌తో చేస్తున్న జైలర్ 2 పూర్తి అయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుందని కోలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోయే రోజులలో వెలువడనుంది. సూపర్‌స్టార్ – ఉలగనాయగన్ కాంబో మళ్లీ తెరపై మాయాజాలం చేయనున్నారనే ఉత్సాహం అభిమానుల్లో కనిపిస్తోంది.