ప్రస్తుతం అన్ని భాషల్లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్నది. సాంస్కృతిక, రాజకీయ, సామాజిక రంగాల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసిన ప్రముఖుల జీవితాలు వెండితెర దృశ్యమానమవుతున్నాయి. ఈ కోవలోనే ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న పురస్కారాన్ని పొందిన తొలి సంగీత కళాకారిణి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవితాన్ని వెండితెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ బయోపిక్‌లో సాయిపల్లవి టైటిల్ రోల్‌ని పోషించనుందని వార్తలొస్తున్నాయి.
‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని తీయనుందని ఫిల్మ్‌నగర్ టాక్. అయితే ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్‌లో విద్యాబాలన్ నటించనున్నట్లు గతంలో వార్తలొచ్చాయి.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలై మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా మరోసారి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్ తెరమీదికి రావడం విశేషం. ప్రస్తుతం సాయిపల్లవి పాన్ ఇండియా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘రామాయణ’లో సీత పాత్రలో నటిస్తున్నది. రణ్‌బీర్‌కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు.