Mrithyunjay | టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు ఈ ఏడాది వరుస సినిమాలని విడుదల చేస్తూ ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తక్కువ గ్యాప్‌లో రెండు సినిమాలను విడుదల చేసి బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. ఫిబ్రవరి 27, 2026న విష్ణు విన్యాసం అనే రొమాంటిక్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణు, కేవలం వారం రోజుల వ్యవధిలోనే మార్చి 6న మృత్యుంజయ్ అనే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌తో మరోసారి థియేటర్లలోకి వచ్చారు. రెండు భిన్న జానర్లలో సినిమాలు చేయడం ఆయన వెర్సటిలిటీని చూపిస్తోంది.
ఇప్పటికే థియేటర్లలో విడుదలైన మృత్యుంజయ్ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను అందుబాటులో ఉంచారు. ఈ చిత్రాన్ని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించారు. థియేటర్లలో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ, ఓటీటీ ప్లాట్ఫామ్లో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే డిజిటల్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు మరింత మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటించగా, సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప శర్మ కీలక పాత్రల్లో కనిపించారు. చిత్రానికి సంగీతాన్ని కాల భైరవ అందించారు. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రానికి సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మాతలుగా వ్యవహరించారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ‘మృత్యుంజయ్’ ఓటీటీలో మంచి ఎంటర్టైన్మెంట్ ఆప్షన్‌గా నిలవనుంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఈ సినిమాను డిజిటల్ ప్లాట్ఫామ్లో చూసే అవకాశం పొందుతున్నారు.