‘ట్రైలర్ విడుదలైన కొద్ది రోజుల్లోనే అన్ని ఏరియాల బిజినెస్ కంప్లీట్ అయ్యింది. చిన్న సినిమాగా మొదలై ట్రేడ్‌లో రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఒక స్పెషల్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని నిర్మించాం. పంపిణీదారులు సినిమా చూసి ఓ మంచి సినిమా తీశారని ప్రశంసించారు’ అన్నారు నిర్మాత అప్పిరెడ్డి. వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జలతో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. సయ్యద్ సోహైల్ రియాన్, రూపా కొడవయార్ జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ వింజనం పాటి దర్శకుడు. ఈ నెల 18న చిత్రం విడుదల కానుంది.ఈ చిత్రానికి సంబంధించిన ఉల్టాపల్టా అనే లిరికల్ వీడియోను శనివారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేసేందుకు నా రియల్‌లైఫ్ ఇన్సిడెంట్స్ను స్ఫూర్తిగా తీసుకున్నాను. నా వైఫ్ ప్రెగ్నెంట్‌గా వున్నప్పుడు అన్ని దగ్గరుండి చూసుకున్నాను. మా పాప పుట్టినప్పుడు ఆమెను నా చేతిలో పెట్టినప్పుడు ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. అలాంటి అమ్మతనం అనే బాధ్యతను ఒక అబ్బాయి తీసుకుంటే ఎలా వుంటుందనే ఆలోచన నుంచి ఈ కథ రాసుకున్నా’ అన్నారు. సోహైల్ మాట్లాడుతూ ‘ఈ సినిమా చేస్తున్నప్పుడు నా మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. కానీ ఈ కథను ఎంతో హుందాగా తెరకెక్కించాం. మేము నిజాయితీగా రూపొందించిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది’అన్నారు.