‘ఇందులో నా పాత్ర పేరు ధరణి. చాలా హైపర్‌గా అల్లరిగా ఉంటా. ప్రతి అమ్మాయి తనకు తాను రిలేట్ చేసుకునేలా నా పాత్ర ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్. ఇదొక అందమైన కావ్యం లాంటి సినిమా. అద్భుతమైన స్క్రిప్ట్. మంచి సినిమా చేశానని సంతృప్తిగా ఉంది’ అని కథానాయిక మోక్ష ఆనందం వ్యక్తం చేసింది. యువహీరో కృష్ణవంశీకి జోడీగా ఆమె నటించిన చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాశ్‌రెడ్డి దర్శకుడు. హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మాతలు. ఆగస్ట్ 2న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మోక్ష సోమవారం విలేకరులతో ముచ్చటించింది.
‘ఈ పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేశా. సెకండాఫ్ అంతా మనాలీలో సాగుతుంది. చలికాలం మైనస్ డిగ్రీలలో షూట్ చేశాం. ఈ కథలో నేచర్ ఫిలాసఫీ ఉంది. దాన్ని క్యాప్చర్ చేయడం సవాల్‌తో కూడుకున్న విషయం. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు ఈ పాత్ర నాకోసమే పుట్టిందనిపించింది. ఆయన విజన్ ఉన్న దర్శకుడు. చాలా హానెస్ట్‌గా తీశారు. అమలాపురం, వైజాగ్‌లో కొంత భాగం షూటింగ్ చేశాం. అక్కడి జనం నన్ను సొంత కూతురిలా చూసుకున్నారు. సంగీత పరంగా, సాహిత్య పరంగా, టేకింగ్ పరంగా కొత్త అనుభూతిని పంచే సినిమా ఇది. అందరికీ నచ్చుతుంది’ అంటూ నమ్మకం వ్యక్తం చేసింది మోక్ష.