TJ Jnanvel | ‘జై భీమ్’ రజనీకాంత్ ‘వెట్టయ్యాన్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. దోశ కింగ్‌గా పేరు తెచ్చుకున్న శరవణ భవన్ హోటల్ యజమాని పి. రాజగోపాల్ జీవితం ఆధారంగా టి.జె. జ్ఞానవేల్ ఒక సినిమాను తెరకెక్కించబోతుండగా.. ఈ చిత్రంలో
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జ్ఞానవేల్ ఈ కథను మోహన్‌లాల్‌కు వినిపించారని, దానికి ఆయన అంగీకరించారని సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
శరవణ భవన్ రెస్టారెంట్స్ వ్యవస్థాపకుడు పి. రాజగోపాల్ జీవితం ఒక విజయగాథ నుంచి విషాదకరమైన నేరగాథగా మారింది. సాధారణ కిరాణా దుకాణం యజమానిగా మొదలైన అతడు కొద్దిరోజుల్లోనే శరవణ భవన్ రెస్టారెంట్‌ను స్థాపించి దోశ కింగ్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే తన ఉద్యోగి కూతురైన జీవజ్యోతిని మూడో పెళ్లి చేసుకుంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారతావు అని ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మిన రాజగోపాల్ మూఢనమ్మకంతో జీవజ్యోతిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే అప్పటికే ఆమె ప్రిన్స్ శాంతకుమార్‌ను వివాహం చేసుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన రాజగోపాల్, 2001లో శాంతకుమార్‌ను కిడ్నాప్ చేయించి హత్య చేయించారు.
ఈ కేసులో రాజగోపాల్‌కు కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేయగా, శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. దీంతో, 2019లో జైలుకు వెళ్లిన రాజగోపాల్, అనారోగ్యంతో జూలై 18, 2019న మరణించారు. ఈ వివాదాస్పద కథనే ఇప్పుడు ‘జై భీమ్’ దర్శకుడు తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.