మోహన్‌లాల్ అనగానే ఎన్నో అద్భుతమైన పాత్రలు కళ్లముందు కదలాడుతాయి. విలక్షణ పాత్రల ద్వారా నటనకు పర్యాయపదంగా నిలిచిన ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. భారతీయ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మోహన్‌లాల్‌ను వరించింది. 2023వ సంవత్సరానికి గాను ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర మోహన్‌లాల్‌ది అని కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఓ ప్రకటనలో కొనియాడింది. ఈ నెల 23న జరిగే 71వ జాతీయ ఫిల్మ్ అవార్డుల వేడుకలో మోహన్‌లాల్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరించబోతున్నారు.
మోహన్‌లాల్ అసలు పేరు మోహన్‌లాల్ విశ్వనాథన్ నాయర్. 1960 మే 21న కేరళలోని పతనంతిట్టలో ఆయన జన్మించారు. ఆరో తరగతిలోనే నటనకు శ్రీకారం చుట్టిన లాల్.. ఓ నాటకంలో 90ఏండ్ల వృద్ధుడిగా నటించి వీక్షకుల ప్రశంసలందుకున్నారు. 1978లో స్నేహితులు నిర్మించిన ‘తిరణోత్తం’ మోహన్‌లాల్ తొలి సినిమా. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. ‘మంజిల్ విరింజ పూక్కల్'(1980) చిత్రంతో విలన్‌గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు మోహన్‌లాల్. ఆ సినిమా గుర్తింపు తెచ్చిపెట్టడంతో.. ప్రారంభంలో ప్రతినాయకునిగా పలు చిత్రాల్లో నటించారు. 1986లో వచ్చిన ‘రాజ వింటే మకన్’ హీరోగా మోహన్‌లాల్‌కు తొలి బ్రేక్. ఆ చిత్రంలో ఆయన పోషించిన అండర్‌వరల్డ్ డాన్ పాత్ర మోహన్‌లాల్‌కు స్టార్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది.
అదే ఏడాది విడుదలైన ‘టి.పి.బాలగోపాలన్ ఎం.ఎ’ చిత్రంతో ఉత్తమనటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు మోహన్‌లాల్. అక్కడ్నుంచి హీరోగా ఆయన ప్రయాణం అప్రతిహతంగా సాగింది. చిత్రం, కిరీడం, కిలుక్కుం, చంద్రలేఖ, నరసింహం, భరతం, దేవాసురం, మణిచిత్రతాళు, కాలాపానీ, యోధ, అభిమన్యు, తన్మాంత్ర, దృశ్యం, పులిమురగన్, లూసిఫర్.. ఎలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన చిత్రాలు, అత్యద్భుతమైన పాత్రలు మోహన్‌లాల్ కెరీర్లో సాక్షాత్కరిస్తాయి.
మలయాళంలో సూపర్‌స్టార్‌గా ఎదిగిన మోహన్‌లాల్.. ఇతర భాషా చిత్రాల్లోనూ నటుడిగా తనదైన ముద్ర వేశారు. తమిళ రాజకీయ చరిత్ర ఆధారంగా మణిరత్నం తెరకెక్కించిన ‘ఇరువర్’ చిత్రంలో ఎమ్జీఆర్ను పోలిన పాత్ర పోషించారు మోహన్‌లాల్. ఆ సినిమా ఫలితం ఎలావున్నా.. నటుడిగా మాత్రం మోహన్‌లాల్‌ని మరో స్థాయిలో నిలబెట్టింది. ఇక మోహన్‌లాల్ తెలుగులో నటించిన తొలి చిత్రం నందమూరి బాలకృష్ణ ‘గాండీవం’(1994). ఆ సినిమాలోని ‘గోరువంక వాలగానె గోపురానికి..’ పాటలో తళుక్కున మెరిశారు లాల్. ఆ సినిమా వచ్చిన 22ఏండ్ల తర్వాత యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘మనమంతా’(2016) సినిమాలో తొలిసారి తెలుగులో హీరోగా నటించారాయన. అదే ఏడాది ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమాలో అద్భుతమైన పాత్ర పోషించి తెలుగులోనూ అఖండ విజయాన్ని అందుకున్నారు. బాలీవుడ్లో మోహన్‌లాల్ తొలి సినిమా రామ్‌గోపాల్‌వర్మ ‘కంపెనీ’. ఆ తర్వాత ఆగ్, తేజ్ చిత్రాల్లో నటించారు. కన్నడంలో ‘లవ్’ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించారు.
దాదాపు నాలుగు దశాబ్దాల నట ప్రస్థానంలో 400పై చిలుకు చిత్రాల్లో నటించారు మోహన్‌లాల్. ఎన్నో శతదినోత్సవాలు, రజతోత్సవాలు, వజ్రోత్సవాలు ఆయన కెరీర్లో ఉన్నాయి . కేరళ సినిమా రికార్డుల పరంగా కనీవినీ ఎరుగని చరిత్రను సృష్టించిన కథానాయకుడు మోహన్‌లాల్. మలయాళంలో తొలి వందకోట్ల సినిమా ‘పులిమురుగన్'(2016). ఆ సినిమా తెలుగులో ‘మన్నెంపులి’గా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. మలయాళంలో తొలి 200కోట్ల సినిమా ‘లూసిఫర్'(2019). చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ ఈ సినిమా రీమేకే.
మోహన్‌లాల్‌ను ‘ది కంప్లీట్ యాక్టర్’ అని ప్రేమతో పిలుస్తుంటారు అభిమానులు. ఆయన కెరీర్లో మెమొరబుల్ పాత్రలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ‘తన్మాత్రా’ ఒకటి. అందులో అల్జిమర్ వ్యాధిగ్రస్తుడిగా నటించారాయన. నటుడిగా ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ పాత్రల్లో ఇదొకటి. ఇక ‘కాలాపానీ’లో అయితే.. లాల్ నటన అనితరసాథ్యం. ఆయన చేసిన తమిళ్ సినిమా ‘ఇరువర్’ షూటింగ్లో, మోహన్‌లాల్ నటిస్తూవుంటే కట్ చెప్పడం మరిచిపోయారట దర్శకుడు మణిరత్నం.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా చెప్పుకుంటే ఎన్నో విభిన్నమైన చిత్రాలు. వైవిధ్యమైన పాత్రలు బహుముఖ ప్రజ్ఞాశాలి మోహన్‌లాల్ అద్భుతమైన ప్రతిభాశాలి.. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన మహానటుడు మాత్రమే కాదు. నిర్మాత, దర్శకుడు, గాయకుడు కూడా. ‘బరోజ్’ అనే వైవిధ్యమైన సినిమాకు దర్శకత్వం కూడా వహించారాయన. ప్రణవం ఆర్ట్స్ ఇంటర్నేషనల్ సంస్థ స్థాపించి ఎన్నో చిత్రాలను నిర్మించారు. మోహన్‌లాల్ గొప్ప గాయకుడు. సినిమాల్లోనే కాదు, వేదికలపై కూడా ఆయన పాటలు పాడిన సందర్భాలున్నాయి. ఆయన కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్నారు.
కెరీర్లో అయిదుసార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు మోహన్‌లాల్. అందులో ఉత్తమ నటుడిగా రెండు సార్లు, నిర్మాతగా ఒకసారి(‘వానప్రస్థం’ చిత్రానికి), జ్యూరీ విభాగాల్లో రెండు సార్లు అవార్డులను గెలుచుకున్నారు. అలాగే 17 పర్యాయాలు కేరళ రాష్ట్ర అవార్డులు, 11 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆయన కైవసం చేసుకున్నారు. భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇవిగాక మరెన్నో అవార్డులు ఆయన కీర్తికిరీటంలో ఉన్నాయి.