Mohanlal | భారతీయ సినీ రంగంలో అత్యంత పాపులర్ నటులలో ఒకరైన మోహన్‌లాల్ కు భారత సైన్యం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. సాయుధ దళాల పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత, సేవా స్ఫూర్తి, సమాజానికి అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ, భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చేతుల మీదుగా మోహన్‌లాల్‌కు ‘చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ కార్డ్’ ను ప్రత్యేక కార్యక్రమంలో అందజేశారు. మోహన్‌లాల్ సమాజ సేవలో, దేశ నిర్మాణ కార్యక్రమాలలో, అలాగే సైన్యం చేపట్టే మానవతా సహాయక చర్యల్లో ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తున్నారని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.
సైనికుల పట్ల గౌరవం, యువతలో దేశభక్తి జ్వాలలు రగిలించే విధంగా ఆయన చేస్తున్న కృషి ఈ గౌరవానికి కారణమైందని తెలిపాయి. ఆర్మీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ .. “మోహన్‌లాల్ గారు ‘సేవ… దేశ ప్రథమ కర్తవ్యం’ అనే స్ఫూర్తిని తన జీవితంలో ప్రతిబింబిస్తున్నారు. సైన్యం పట్ల ఆయన అంకితభావం దేశానికి ప్రేరణ” అని అన్నారు. మోహన్‌లాల్ కేవలం నటుడిగానే కాకుండా, భారత టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా లో కూడా ఉన్నారు. 2009 మే నెలలో ఆయనకు ఈ గౌరవం లభించింది. అప్పటి నుంచి సైన్యంతో ఆయనకు సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. క్రమశిక్షణ, సేవా భావం, జాతీయ సమైక్యత వంటి విలువలు ఆయన పాటిస్తూ వస్తున్నారు.
2024 ఆగస్టులో కేరళలోని వాయనాడ్‌లో సంభవించిన భారీ వరదల సమయంలో మోహన్‌లాల్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొని తన సేవా భావాన్ని చూపించారు. ఆ సమయంలో ఆయన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా ఆహారం, వైద్య సహాయం, పునరావాసం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. మోహన్‌లాల్ స్థాపించిన విశ్వశాంతి ఫౌండేషన్ దేశవ్యాప్తంగా విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో అద్భుత సేవలు అందిస్తోంది. సమాజ అభ్యున్నతే తన లక్ష్యమని మోహన్‌లాల్ పలుమార్లు స్పష్టం చేశారు. సినీ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా మోహన్‌లాల్ తన నటనతో అలరిస్తున్నారు. మలయాళం మాత్రమే కాకుండా తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ ఆయన నటించి అలరించారు.