Mohan Babu | తెలుగు సినీ పరిశ్రమలో స్టార్స్‌గా వెలిగిన నటులలో మోహన్ బాబు కూడా ఒకరు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకి మంచి వినోదం పంచారు. ఆయన తన సినీ కెరీర్‌తో పాటు విద్యా రంగంలోనూ అనేకమంది జీవితాలను మార్చిన అరుదైన వ్యక్తిగా నిలిచారు. ఇప్పటివరకు 500కి పైగా చిత్రాల్లో హీరో, విలన్, కమెడియన్, నిర్మాతగా కనిపించిన మోహన్ బాబు, “కలెక్షన్ కింగ్”, “డైలాగ్ కింగ్” అనే బిరుదులతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.ఇక ఆయన స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థ ఎంతో మందికి విద్యను అందించడంలో కీలక పాత్ర పోషించాయి.
ముఖ్యంగా సామాన్య కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు 25 శాతం ఉచిత విద్యా అవకాశాలు, ఫీజు రాయితీ అందించి మానవతా దృక్పథాన్ని చాటారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు ఒక ఆసక్తికర విషయం వెల్లడించారు. తన విద్యాసంస్థలో చదివిన ఒక అమ్మాయి ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్గా ఎదిగిందని, కానీ ఆ సమయంలో ఆమె పేరు గుర్తుకు రాలేదని చెప్పారు. ఆ తరువాత వెలుగులోకి వచ్చిన విషయాల ప్రకారం, ఆయన ప్రస్తావించిన వ్యక్తి మరెవరో కాదు, ప్రస్తుత బ్లాక్ బస్టర్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ అన్నది స్పష్టమైంది.
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేష్ కుమార్తె అయిన ఐశ్వర్యా.. లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి మేనకోడలు కావడం విశేషం. అయితే ఆమె చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోవడం, ఆ తర్వాత తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ స్కూల్ లో విద్యాభ్యాసం పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత చెన్నైకు వెళ్లిన ఐశ్వర్య, ఆనతి కాలంలోనే కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఐశ్వర్యా రాజేష్ తనదైన నటనతో స్టార్ హీరోల సినిమాల్లో మెరిస్తూనే, మహిళా ప్రధాన చిత్రాల్లో బలమైన పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఈ సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో ఐశ్వర్య నటించగా, ఈ చిత్రం రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి, ఆమె కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం అటు తమిళంలో, ఇటు తెలుగులో నటిస్తూ అలరిస్తుంది.