Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ‘కూలీ’ బాక్సాఫీస్ వద్ద విజయవిహారం కొనసాగిస్తోంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్, ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, శృతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, రెబా మోనికా జాన్ కీలక పాత్రల్లో మెప్పించగా, గ్లామర్ గర్ల్ పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్‌తో అదరగొట్టింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా, అన్ని మార్కెట్లలో సెన్సేషనల్ ఓపెనింగ్స్ రాబట్టింది.
రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ, తొలి రోజే రూ.151 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా హిస్టరీలో న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఒకేరోజు ఈ స్థాయిలో గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కూలీ’ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ ఏడాది రజినీకాంత్ సినీ కెరీర్‌కు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ‘కూలీ’ రిలీజ్ కావడం, అది ఘనవిజయం సాధించడం అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షల వెల్లువెత్తుతుంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ, “చలనచిత్ర ప్రపంచంలో 50 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజినీకాంత్‌గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన పాత్రలు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసాయి. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను,” అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రజినీకి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. “రజినీకాంత్‌గారి నటనా ప్రస్థానం దేశానికి గర్వకారణం” అని కొనియాడారు. 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేయడం, అదే సమయంలో దేశవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన ‘కూలీ’ వంటి మల్టీ లాంగ్వేజ్ బ్లాక్‌బస్టర్ అందించడంతో రజినీకాంత్ మరోసారి తన స్టార్‌డమ్‌ను నిరూపించుకున్నారు.