జక్కన్న మనం పెట్టుకున్న పెట్ నేమ్. మోడ్రన్ మాస్టర్ ప్రపంచం పెట్టిన బ్రాండ్ నేమ్. మరి, మనకు తెలిసిన రాజమౌళి మోడ్రన్ మాస్టర్‌గా ఎలా ఎదిగాడు? చెప్పాలంటే ఓ పుస్తకం అవుతుంది. తీస్తే ఓ డాక్యుమెంటరీనే అవుతుంది. అందుకే.. నెట్‌ఫ్లిక్స్ ఆయనపై ఓ డాక్యుమెంటరీ చిత్రీకరించింది. ఓటీటీలో ఇప్పుడంతా మన ఎస్ఎస్ రాజమౌళి గురించే!!
SS Rajamouli | ఎవరిని అడిగినా ‘ఎస్ఎస్’ ఈ డాక్యుమెంటరీకి అర్హుడే అని ప్రశంసిస్తున్నారు. మన తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటాడంటూ సినిమా ప్రియులు పొంగిపోతున్నారు. ఇక మన సెలెబ్రిటీలైతే మా జక్కన్న అంటూ మురిసిపోతున్నారు. ఇదంతా గమనించే నేటి తరానికి ఏమనిపిస్తుంది? ‘ఎస్ హి డిసర్వ్స్’ మేం బాహుబలి చూశాంగా! దాని సీక్వెల్ కూడా తెలుసు.. ఇక ఆర్ఆర్ఆర్ అయితే.. అరుపులే! అని గలగలా చెప్పేస్తారు? అంతే వారికి తెలిసింది.. కానీ, నాడు ఈ మోడ్రన్ మాస్టర్.. ఒకప్పటి ‘స్టూడెంట్ నెం.1’.. కళామతల్లి ఒడిలో ఎంతో క్రమశిక్షణతో సినిమాను చదువుకున్నాడు.. సినిమాలో కథల్ని, క్యారెక్టర్లను, 24 క్రాఫ్ట్‌లను ఓ శిల్పిలా చెక్కడం మొదలెట్టాడు.. ఇండస్ట్రీ చేత జక్కన్న అని పిలిపించుకున్నాడు.. ఈ తరానికి అర్థమయ్యేలా చెప్పాలంటే.. తన సక్సెస్ ఫార్ములాను తనే రాసుకున్నాడు.. ఆ విజయపాఠాలు నేటి తరానికి ఎంతో అవసరం!
ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్. మంటల్లో చిక్కుకున్న కుర్రాడిని కాపాడాలి. హీరోలు ఇద్దరూ సైగలు చేసుకుంటారు.. చేయీచేయీ కలుపుతారు.. బుడ్డోడు సేఫ్!!.. హే.. ఇది ‘ఆర్ఆర్ఆర్’ కదా! అవును.. రాజమౌళి పక్కా ప్లానింగ్‌లో ఇదో చక్కటి సీన్. సినిమా టైటిల్లో కలిసిన రెండు చేతులకు ఓ అర్థాన్ని చెప్పే నాందీ ప్రస్తావన. ఈ సన్నివేశంలో.. తొలుత భీమ్ పాత్ర బుడ్డోడిని ముందుగా అందుకుంటుంది.
రామ్ పాత్ర జెండా పట్టుకుంటుంది. చివర్లో.. ఆ పిల్లాడిని రామ్ అందుకుంటాడు, రామ్ చేతిలో ఉన్న జెండాను భీమ్ చేజిక్కించుకుంటాడు. సినిమా కథంతా ఈ ఒక్కసీన్‌లో చెప్పేశాడు జక్కన్న. ైక్లెమాక్స్‌లో బ్రిటిష్ అధికారి అడవినుంచి తీసుకొచ్చిన చిన్నారిని రామ్ కాపాడి భీమ్ చేతుల్లో పెడతాడు. స్వతంత్ర పోరాటానికి మర తుపాకులు సాధిస్తానన్న రామ్ మాటను భీమ్ నెరవేరుస్తాడు.
దటీజ్ రాజమౌళి! కథలో ఇద్దరి లక్ష్యం ఒక్కటే.. కలిసే సాధిస్తారని తెలిపిన సీన్ ఇది. అందులో కనిపించే ట్రైన్.. అది క్రాష్ అవ్వడం.. మంటలు చెలరేగడం.. అదంతా రాజమౌళి పక్కా ప్రణాళికతో రూపొందించిన.. అబ్బురపరిచే సెట్టింగ్. అంటే.. దేనికైనా పక్కాగా ప్లానింగ్ అవసరం. మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే.. పాఠ్యాంశాలు, ప్రాజెక్టు వర్క్‌లు, క్యాంపస్ ఇంటర్య్వూలు.. ఏది చేపట్టినా ముందో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అప్పుడే మీ నుంచి వచ్చే అవుట్‌పుట్‌కు ప్రపంచం సలామ్ చేస్తుంది. మీరెప్పుడైతే ‘స్టూడెంట్ నెంబర్ 1’గా ప్లానింగ్ చేస్తారో.. అప్పుడు ‘ఛత్రపతి’లా కెరీర్ లో దూసుకెళ్లొచ్చు. సో.. ప్లాన్ పక్కా ఉండాలన్నమాట. అప్పుడే రాజమౌళిలా దేనికైనా ‘సై’ అంటూ ముందుకెళ్లొచ్చు.
దేన్నయినా ఎన్నుకునే టైమ్‌లోనే చాలా స్పష్టత అవసరం. అందుకే రాజమౌళి కథలు, కథానాయకుల ఎంపికను మనం పరిశీలించాలి. ‘స్టూడెంట్ నెంబర్ 1’లో జూనియర్ ఎన్టీఆర్ దగ్గర్నుంచి ‘ఈగ’లో నాని.. ‘మర్యాదరామన్న’లో సునీల్.. ఇలా ఆయన కథల చాయిస్ చూస్తే.. ఎంపిక దశలోనే సగం సక్సెస్‌ను సొంతం చేసుకోవచ్చేమో అనిపిస్తుంది. సో.. దీన్నే మీరు లైఫ్‌కు అన్వయించుకుంటే.. చదివే చదువు, చేసే ఉద్యోగం, ఆడే ఆటలు, రాణించే కళలు.. దేంట్లో అయినా ఎంపిక విషయంలో చాలా స్పష్టత ఉండాలి.
‘ఇది నాకు సరైనదేనా? నేను రాణించగలనా? నా శక్తిసామర్థ్యాలు సరిపోతాయా?’ అని బేరీజు వేసుకుంటే మీలోని ‘మగధీరుడు’కి చక్కని చాయిస్ దొరికినట్టే. ఇంకేముంది.. ‘విక్రమార్కుడు’లో రవితేజలా మీసం మెలేసి ఓటమిని సవాల్ చేయొచ్చు. అప్పుడు ర్యాంకులు, ప్రమోషన్లు మీకో ఫ్యాన్ బేస్‌లా వెంటే తిరుగుతాయి.
ఆఫీస్‌లో ఆన్సైట్ ప్రాజెక్టు కావచ్చు.. సెట్స్‌పైకి వెళ్లే సినిమాలే కావచ్చు.. దేంట్లోనైనా.. టీమ్, టీమ్ వర్క్ బ్యాలెన్స్ రెండూ చాలా అవసరం. రాజమౌళి విజయంలో టీమ్ ఎఫర్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మ్యూజిక్, ఆర్ట్, స్టంట్స్, గ్రాఫిక్స్.. ఇలా రాజమౌళితో జట్టు కట్టే టీమ్ ఏదైనా-వారి ప్రతిభని ఒడిసిపట్టడంలో ఆయన దిట్ట అని చెప్పొచ్చు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. సో.. ఇదే మాదిరిగా మీరూ టీమ్ వర్క్‌ని మేనేజ్ చేయడం ఓ ఆర్ట్ అని అర్థం చేసుకోవాలి. వారిలో దాగుకున్న టాలెంట్‌ని గుర్తించాలి, ప్రోత్సహించాలి. అప్పుడే బృందం ఓ సైన్యంలా పనిచేస్తుంది. అప్పుడు మీరు అమరేంద్ర బాహుబలిలా.. ‘నాతో గెలిచేదెవరు?’ అంటూ.. విజయోత్సాహాన్ని పెంపొందించొచ్చు.
ఎంతో కష్టపడతారు. కానీ, దాంట్లో నిశితమైన పరిశీలన లేకపోతే నాణ్యత లోపిస్తుంది. రంగం ఏదైనా.. చేసే పనేదైనా.. చిన్నదైనా.. పెద్దదైనా.. నిశిత పరిశీలనను ఓ వ్రతంగా పరిగణించాలి. అదే రాజమౌళి బలం. తీసేది చాలా చిన్నషాట్ కావచ్చు.. ఆయన పరిశీలనతో పర్ఫెక్ట్గా చెక్కుతాడు. ఇదే విషయాన్ని జక్కన్నతో పనిచేసిన హీరోలు ఎన్నోసార్లు తమ ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. బాహుబలిలో శివుడు అదేపనిగా, దొంగచాటుగా అవంతిక భుజంపై, చేతిపై పచ్చబొట్టేస్తాడు. సగం పచ్చబొట్టని అప్పుడు మనం గుర్తించం. ఆ తర్వాత ‘పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో..’ పాటలో రాజమౌళి దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుంది. ‘చేయి నీ చేతిలో చేరగా.. రెక్కవిప్పింది నా తొందర’ పంక్తుల దగ్గర రెండు చేతులు జతకలిసినప్పుడు రెక్కలు విప్పినట్టు ప్రేమపక్షి ప్రత్యక్షమవుతుంది.
మరో చరణంలో.. ‘కోడె పొత్తిళ్ల కౌగిళ్లలో పురి విప్పింది నా తొందర’ దగ్గర ఓ విపంచి కనిపించి అచ్చెరువొందేలా చేస్తుంది. ఆ పాట రాసింది అనంత్ శ్రీరామ్. దర్శకుడిగా ఆ పాటను ఎలా చిత్రించేది ముందుగానే ఊహించుకొని, అందుకు తగ్గట్టుగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని.. రచయితతో తన ఊహాచిత్రాన్ని రాయించుకున్నాడన్నమాట. రాజమౌళి నిశిత పరిశీలనకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి! అది పాటే కావచ్చు.. డైరెక్టర్ రోల్ పెద్దగా ఉండకపోవచ్చు.. అయినా.. ఆయన చూపే చొరవ.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ని చేసింది. మీలోనూ అంతే నిశిత పరిశీలన ఉంటే చేపట్టిన పనిలో నాణ్యత పెరుగుతుంది. మార్కెట్లో మీ వాల్యూ డబుల్ అవుతుంది.
‘చేయాల్సినదంతా చేశాం.. అలసిపోయాం, జయాపజయాలు దైవాధీనం’ అనుకుంటే పొరబాటే. చేసిన పనిని ముందుండి మార్కెటింగ్ చేయాలి. రాజమౌళి సక్సెస్ సీక్రెట్స్లో ఇదీ ఒకటి. తన హీరోలకి దీటుగా సినిమా మార్కెటింగ్‌లో ముందుంటాడు. భిన్నమైన ఐడియాస్‌లో తన సినిమా కంటెంట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాడు. రిలీజ్ డేట్ ఎప్పుడొస్తుందా? అని ఫ్యాన్స్ ఓ పండుగలా ఎదురు చూస్తారు. అంటే.. మీ బ్రాండ్‌ను మీరే నేటి పోటీ ప్రపంచంలో పెంచుకోవాలి.
‘మేం తోపులం.. మేం ఏం చేసినా జనాలు ఎగబడతారు’ అనుకుంటే మీరు ‘మర్యాదరామన్న’లో హీరోలా గడపదాటేందుకు భయపడే కోవలోకి వస్తారు. లైఫ్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ‘ఈగ’లా వచ్చి అవకాశాలను గద్దలా తన్నుకుపోవడానికి సిద్ధంగా ఉండాలి. ‘ఈగ’నే ఓ బ్రాండ్లా మలిచే జక్కన్నలా లైఫ్‌లో ముందుకు సాగాలి. సక్సెస్ ఆస్వాదిస్తూ.. మరో మైలురాయి పాతేందుకు సిద్ధమవ్వాలి. అప్పుడే నేటి మోడ్రన్ లైఫ్‌ను గెలిచే మాస్టర్ కాగలరు.
య‘మహా నటుడు’
ఎవరూ చెప్పని కథలు ఆయన చెప్పడానికి వచ్చాడు. సినిమాలు తీయడానికే పుట్టాడు. ఇంకో విషయం రాజమౌళి సినిమాలో హీరోలు హీరోలు కాదు.. దే ఆర్ వెపన్స్. అంత పవర్ఫుల్. అలాగే, నాకు బాగా గుర్తుంది. ‘స్టూడెంట్ నెంబర్ 1’ షూటింగ్ అప్పుడు ఆయనకు ఓ యమహా బైక్ ఉండేది. దాన్ని వేసుకుని షూట్ చేసే సీన్స్ రాఘవేంద్రరావు గారికి చెప్పి.. అదే బైక్ మీద మళ్లీ సెట్స్‌కు వచ్చి షూట్ చేసేవాడు. ఆయనుకున్నది పిచ్చి అని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఆయనో మంచి నటుడు కూడా!
– ఎన్టీఆర్
కొత్త నటుడు పుట్టుకొస్తాడు
ఆయన చెప్పింది చేస్తే చాలు. మనలో మనకే ఓ కొత్త నటుడు కనిపిస్తాడు. ఆయన వర్క్ చేసిన తర్వాత మనలో ఓ కొత్త నటుడు పుడతాడు. నటించి చూపిస్తూ డైరెక్ట్ చేసే గొప్ప డైరెక్టర్ రాజమౌళి. ఆయన నిశిత పరిశీలన ఎంతంటే.. థియేటర్లో అన్ని మూలల నుంచి సినిమా చూసిన ప్రేక్షకుడంత.. అని చెప్పొచ్చు.
– రామ్‌చరణ్
– ఆర్యన్ రాజేష్