‘నలుగురు కుర్రాళ్లు కలిసి చేసే బడ్డీ కామెడీ ఎలా ఉంటుందో.. ‘మిత్రమండలి’ అలా ఉంటుంది. ఈ సినిమా చేయడానికి మాకు స్ఫూర్తినిచ్చిన సినిమా ‘జాతిరత్నాలు’. ఇది యంగ్‌స్టర్స్ అంతా కలిసి తీసిన సినిమా. మేం వాళ్లకు సపోర్ట్ ఇచ్చాం అంతే. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. థియేటర్లకొచ్చి మనస్ఫూర్తిగా నవ్వుకోండి.’ అని బన్నీ వాస్ అన్నారు. ఆయన సమర్పణలో ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘మిత్ర మండలి’. విజయేందర్.ఎస్ దర్శకుడు. కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా.విజయేందర్‌రెడ్డి తీగల నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా గురువారం ఈ చిత్ర టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ టీజర్‌ని ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఆద్యంతం నవ్వులు పంచేలా ఈ టీజర్ సాగింది. టీజర్‌ని మించిన వినోదాన్ని సినిమా పంచుతుందని దర్శకుడు చెప్పారు. అందర్నీ అలరించే సినిమా ఇదని నిర్మాతల్లో ఒకరైన భాను ప్రతాప నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా హీరో ప్రియదర్శి, కథానాయిక నిహారికలతోపాటు అతిథులుగా విచ్చేసిన అనుదీప్ కె.వి, నిర్మాత ఎస్.కె.ఎన్ కూడా మాట్లాడారు.