“మిరాయ్’ విడుదలై 45రోజులు అయ్యింది. ఓటీటీకి వచ్చేంతవరకూ థియేటర్లలో రన్ అవుతూనేవుంది. ఓటీటీకి వచ్చేశాక కూడా ఈ ఈవెంట్ పెట్టడంలోనే తెలుస్తున్నది నిర్మాత విశ్వప్రసాద్ ఈ సినిమాను ఎంత ప్రేమించారో. మాకు ఇంతటి బ్రహ్మాండ్ బ్లాక్‌బస్టర్‌ని ఇచ్చిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి కృతజ్ఞతలు.’ అని హీరో తేజ సజ్జా అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన సోషియో ఫాంటసీ డివోషనల్ థ్రిల్లర్ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం గత నెల 12న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బ్రహ్మాండ్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్‌ని నిర్వహించారు.
అగ్ర నిర్మాత వై.రవిశంకర్, దర్శకులు మారుతి, వెంకటేశ్ మహా, సంపత్‌నంది, శ్రీరామ్ ఆదిత్య ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు అందంచారు. ‘తెలుగులో అత్యధికంగా ప్రేక్షకులు వీక్షించిన సినిమాగా ‘మిరాయ్’ నిలుస్తుందనేది ఓటీటీ రిపోర్ట్. దేశంలోనే ఎక్కువమంది చూసిన సినిమాగా నిలవాలని ఆశిస్తున్నాం.’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆశాభావం వెలిబుచ్చారు. ‘మిరాయ్’ ఓ మ్యాజిక్ అనీ, అందరి కొలాబరేషన్‌తో ఈ విజయం సాధ్యమైందని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని పేర్కొన్నారు. ఇంకా కథానాయిక రితిక నాయక్, సంగీత దర్శకుడు గౌరహరి, పంపిణీదారుడు శశిధరరెడ్డి కూడా మాట్లాడారు.