‘తెలంగాణ ప్రభుత్వం సినీ రంగానికి, కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటున్నది. చిత్రపురి కాలనీలో మంచినీటి సమస్య ఉందని చెప్పారు. అధికారులతో మాట్లాడి మిషన్ భగీరథ పైప్లైన్ వచ్చేలా ఏర్పాటు చేస్తా. అలాగే చిత్రపురి కాలనీలో ఆసుపత్రి నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పించేందుకు కృషి చేస్తా’ అని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్.
సినీ కార్మికుల కోసం హైదరాబాద్ చిత్రపురి కాలనీలో నిర్మించిన నూతన గృహ సముదాయాన్ని గురువారం అగ్ర నటుడు చిరంజీవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘ప్రతిసారి ఇండస్ట్రీ పెద్ద అని చెబుతుంటారు. ఇండస్ట్రీలో పెద్దరికం అనుభవించాలనే కోరిక లేదు. భగవంతుడు నాకు అనుకున్నదాని కంటే ఎక్కువే ఇచ్చాడు. సినీ కార్మికులు, కళాకారులకు నేనెప్పుడూ అండగా ఉంటా’ అన్నారు.