హైదరాబాద్ : సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి వెళ్లి కృష్ణ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా సూపర్ స్టార్ కృష్ణ వెలుగొందారని చెప్పారు. కృష్ణ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. సింహాసనం, మోసగాళ్లకు మోసగాడు, గూఢచారి తదితర 340 కి పైగా చిత్రాలలో నటించి తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని అన్నారు. 16 చిత్రాలకు దర్శకునిగా పనిచేశారని తెలిపారు. మంత్రితో పాటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం కూడా కృష్ణ పార్ధీవ దేహం వద్ద నివాళులు అర్పించారు.