హైదరాబాద్ : తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు తగ్గించమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రితలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఒమిక్రాన్ నేపథ్యంలో థియేటర్లపై ఆంక్షలు విధిస్తారన్న ప్రచారం నేపథ్యంలో మంత్రితో నిర్మాతలు, దర్శకులు భేటీ అయ్యారు. భేటీకి దిల్రాజు, దానయ్య, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా పరిస్థితులు, థియేటర్లలో ఆంక్షలపై జరుగుతున్న ప్రచారం, సినిమా టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై చర్చించినట్లు తెలుస్తున్నది.
సమావేశం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కరోనా దృష్ట్యా థియేటర్లపై ఆంక్షలు పెడుతారన్నది కేవలం అపోహమాత్రమేనన్నారు. ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలని, సినిమా చూస్తే థియేటర్లలోనూ చూడాలని సూచించారు. కరోనా వల్ల రెండేళ్లుగా సినీ పరిశ్రమకు ఇబ్బందులున్నాయని, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో ఒమిక్రాన్ వస్తోందన్నారు. అయితే, కొవిడ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని దర్శక, నిర్మాతలకు చెప్పామన్నారు. గతంలో పెండింగ్లో ఉన్న సమస్యలపై చర్చించినట్లు పేర్కొన్నారు.
సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయని, సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా టికెట్ల ధరలు తగ్గిస్తారన్న విషయంపై సైతం మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఎక్కడో ఎవరో తగ్గించారని.. మేం తగ్గించమని స్పష్టం చేశారు. సినిమా టికెట్ల ధరల సవరణ నిమిషాల్లో జరిగే పనికాదన్నారు. ఏ వైరస్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొవిడ్ దృష్ట్యా థియేటర్ల సామర్థ్యం 50శాతం చేస్తారని ప్రచారం జరిగిందని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. సంక్రాంతి వరకు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.