‘యానిమల్’ సినిమాతో ఒక్కసారిగా యువతలో క్రేజ్ సంపాదించుకుంది బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ. ప్రస్తుతం ఈ అమ్మడికి వరుసగా భారీ ఆఫర్లొస్తున్నాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బ్యాడ్ న్యూజ్’ చిత్రం కూడా ఈ భామకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ చిత్రం అక్టోబర్ 11న విడుదలకానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇప్పటివరకు తనకు సినిమాల్లో డ్యాన్స్ చేసే అవకాశం రాలేదని, ఈ సినిమాలో ‘మేరే మెహబూబ్’ అనే పాట ఆ లోటును తీర్చిందని ఆనందం వ్యక్తం చేసింది. ‘నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా డ్యాన్స్ చేసే అవకాశం దక్కలేదు.
ఈ విషయం చాలా బాధపెట్టేది. ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ చిత్రంలో నాపై పాట ఉందని తెలియగానే పట్టరాని సంతోషమేసింది. కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ప్రోత్సాహంతో చాలా సులభంగా డ్యాన్స్ చేయగలిగాను. నేను తొలిసారి డ్యాన్స్ చేసిన ఈ పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని త్రిప్తి డిమ్రీ ఆనందం వ్యక్తం చేసింది.