Chiranjeevi | తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ఘటనపై తెలుగు సినీ పరిశ్రమ సీనియర్ నటుడు, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తాను ప్రగాడ సానుభూతి తెలుపుతున్నట్లు మెగాస్టార్ ట్వీట్ చేశారు. “తమిళనాడులోని కరూర్ ర్యాలీలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఈ ఘటనలో పలువురు గాయపడగా, బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ర్యాలీలో ఏర్పాట్లపై అధికారులు సమీక్ష ప్రారంభించినట్టు తెలుస్తోంది. విజయ్ రాజకీయ రంగప్రవేశానికి అనుసంధానంగా నిర్వహించిన ఈ ర్యాలీలో ఇలా విషాదం చోటుచేసుకోవడం అభిమానులను, రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నారు. సుమారు లక్ష మందికిపైగా కిక్కిరిసిన సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో ఇప్పటివరకు 39 మంది మరణించారు. వీరిలో 8 మంది చిన్నారులు, 16 మందికిపైగా మహిళలు ఉన్నారు. మరో 400 మందికిపైగా దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.
కాగా, ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. సీఎం స్టాలిన్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. తొక్కిసలాటకు దారితీసన విషయమై ఆరాతీశారు. అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. దవాఖానల్లో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ శుక్రవారం ఉదయం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. కాగా, తమిళనాడు చరిత్రలో ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని సీఎం స్టాలిన్ అన్నారు. ఇప్పటివరకు 39 మంది మరణించారని చెప్పారు. ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారని వెల్లడించారు.