Mega Victory Mass | మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేశ్ వంటి ఇద్దరు అగ్ర హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ సందడే వేరు, అలాంటిది వీరిద్దరూ కలిసి స్టెప్పులేస్తే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ సినిమాలో వెంకటేశ్ అతిథి పాత్రలో మెరవడమే కాకుండా, చిరుతో కలిసి ‘అదిరిపోద్ది సంక్రాంతి’ (Mega Victory Mass Song) అనే మాస్ సాంగ్‌లో చిందులేసి థియేటర్లను హోరెత్తించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకోగా, ఈ ఇద్దరు స్టార్ల కాంబోలో వచ్చిన పాట హైలైట్‌గా నిలిచింది. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ఈ ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ ఫుల్ వీడియోను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ మాస్ పల్స్ తెలిసిన పదాలతో ఈ పాటను అద్భుతంగా రచించగా, నకాశ్ అజీజ్ మరియు విశాల్ దడ్లానీ తమ ఎనర్జిటిక్ వాయిస్‌తో పాటకు ప్రాణం పోశారు. సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో అందించిన ఊపు నిచ్చే సంగీతం ప్రేక్షకులను ఆద్యంతం ఉర్రూతలూగిస్తోంది. అనిల్ రావిపూడి తనదైన శైలిలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందించిన ఈ చిత్రంలో చిరంజీవి మార్క్ కామెడీ మరియు యాక్షన్, దానికి తోడు వెంకటేశ్ తోడవ్వడం సినిమా విజయానికి ప్రధాన కారణమయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియో సాంగ్‌లో చిరు, వెంకీ మధ్య ఉన్న కెమిస్ట్రీ మరియు వారి గ్రేస్ ఫుల్ డాన్స్ మూమెంట్స్ చూసి నెటిజన్లు ‘అదిరిపోద్ది సంక్రాంతి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.