Chiranjeevi | వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, విశ్వక్సేన్, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు విరాళం ప్రకటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా వరద బాధితుల కోసం తన వంతు సాయం ప్రకటించారు. ఏపీ, తెలంణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు తనను కలిచివేస్తున్నాయని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరమని అన్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయని తెలిపారు. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నానని వెల్లడించారు. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు.
టాలీవుడ్ సెలబ్రెటీలు ఇచ్చిన విరాళాల వివరాలు..
– నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– మహేశ్‌బాబు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళం
– త్రివిక్రమ్, సూర్యదేవర రాధాకృష్ణ, నాగవంశీ కలిసి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 25 లక్షల చొప్పున విరాళం
– సిద్ధూ జొన్నలగడ్డ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 15 లక్షల చొప్పున 30 విరాళం
– విశ్వక్సేన్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 5 లక్షల చొప్పున 10 లక్షల విరాళం
– డైరెక్టర్ వెంకీ అట్లూరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 5 లక్షల చొప్పున 10 లక్షల విరాళం
– అనన్య నాగళ్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 5 లక్షల విరాళం