తెలుగు చిత్రసీమలో అనతికాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది పంజాబీ భామ మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఈ అమ్మడికి చేతినిండా సినిమాలున్నాయి. తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ సరసన ఆమె నటించిన తాజా చిత్రం ‘GOAT’ ( గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి పాత్రికేయులతో మాట్లాడుతూ ‘విజయ్ వంటి అగ్ర హీరోతో కలిసి నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ సినిమాలో నేను ఆధునిక భావాలు కలిగిన కాలేజీ అమ్మాయిగా కనిపిస్తా. నా పాత్ర సరదాగా సాగుతుంది. నా వ్యక్తిగత జీవితానికి కూడా రిలేట్ అయ్యే క్యారెక్టర్ ఇది.
కథాగమనంలో కూడా నా పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది’ అని చెప్పింది. వరుసగా వస్తున్న సినిమా ఆఫర్ల గురించి మాట్లాడుతూ ‘గత ఏడాది అంగీకరించిన సినిమాలు ఈ ఏడాది వరుసగా రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. సినిమాల ఎంపిక విషయంలో స్క్రిప్ట్‌కే తొలి ప్రాధాన్యత. ఆ తర్వాతే నా క్యారెక్టర్ గురించి ఆలోచిస్తా’ అని మీనాక్షి చౌదరి పేర్కొంది. తన తదుపరి సినిమాల గురించి చెబుతూ..“మెకానిక్ రాకీ’లో మిడిల్‌క్లాస్ అమ్మాయిగా కనిపిస్తా. ‘లక్కీ భాస్కర్’లో తల్లి పాత్రలో నటించా. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో పోలీస్ పాత్రను పోషిస్తున్నా’ అని పేర్కొంది.