‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అంటూ టాలీవుడ్‌కు పరిచయమైన హర్యానా అందం.. మీనాక్షి చౌదరి. ఆ తర్వాత ‘ఖిలాడి’గా మాస్ మహారాజ రవితేజ సరసన ఆడిపాడింది. అడివి శేష్‌తో ‘హిట్ 2’ కొట్టేసింది. తాజాగా..‘గుంటూరు కారం’లో సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో తెరను పంచుకున్నది. అందచందాలతోపాటు అభినయాన్ని మేళవించి.. వరుస అవకాశాలను దక్కించుకుంటున్న ‘మీనాక్షి’ మనసులో మాటలు..
Meenkshi Chaudhary | సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో నటించే అవకాశం వచ్చిందని తెలియగానే నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొదటిరోజు మొదటి షాట్ కూడా ఆయనతోనే! చాలా టెన్షన్ పడ్డాను. నా భయాన్ని గమనించి.. టెన్షన్ పడొద్దనీ, కావాలంటే ఇంకొంత టైమ్ తీసుకోమని ధైర్యం చెప్పారు మహేశ్. ఆ మాటలే నాలో భయాన్ని పోగొట్టాయి. ఎంతోధైర్యం ఇచ్చాయి
నాకోసం నేను కొన్ని నియమాలు పెట్టుకున్నా. అందులో ప్రధానమైంది.. నా కంఫర్ట్. స్క్రిప్ట్ ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా.. ముందే చెప్పేస్తాను. ఈ కారణంగా నేను పెద్దపెద్ద ప్రాజెక్టులను కూడా వదిలేసుకున్నాను.
తెరపై ముద్దులకు సంబంధించి కూడా.. కొన్ని నియమాలు పాటిస్తా. స్క్రిప్ట్ డిమాండ్ చేసి, మరీ అసభ్యకరంగా లేకుంటే.. నేను సిద్ధమే! కానీ, కేవలం ముద్దు సీన్ల కోసమే అంటే.. నేను కచ్చితంగా వద్దని చెబుతాను.
తెలుగు సినిమా పరిశ్రమ నా పట్ల చాలా ఆప్యాయత చూపుతున్నది. భాష ఏదైనా మంచి సినిమాలు చేయాలని నా కోరిక. అందుకోసమే ఆచితూచి ఎంచుకుంటున్నా. డబ్బు కంటే ముఖ్యంగా.. నేను చేసే పనికి ప్రశంసలతోపాటు గౌరవం దక్కాలని కోరుకుంటున్నా.
మహేశ్‌బాబు లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆయన చాలా మంచి వ్యక్తి.. ఎంతో ప్రత్యేకం కూడా! సెట్లో ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. అందుకే ఆ స్థాయిలో ఉన్నారు. ఇక రవితేజ.. ఫైర్‌బ్రాండ్! తన కామెడీ టైమింగ్ అద్భుతం.
తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. చాలా స్క్రిప్టులు వింటున్నాను. సినిమాల్లో బిజీగా మారడం కోసమే.. ఏ ప్రాజెక్టును పడితే ఆ ప్రాజెక్టును ఓకే చేయడం నాకు నచ్చదు. ఏదైనా ఒక గొప్ప ప్రాజెక్టులోనే భాగం కావాలని అనుకుంటున్నా. అప్పుడే, మన సత్తా ప్రపంచానికి తెలుస్తుంది.
సినిమాలో నా పాత్ర ప్రాధాన్యం గురించే ఆలోచిస్తా! ఆ పాత్ర నిడివి ఎంతన్నది పట్టించుకోను. అంతిమంగా ప్రేక్షకులను ప్రభావితం చేయాలి.
‘ఐటమ్ సాంగ్స్’కు నేను వ్యతిరేకం కాదు. కానీ, ఇప్పుడే చేయకూడదని మాత్రం నిర్ణయించుకున్నా!
కేవలం ఇలాంటి సినిమాలే చేయాలని గిరి గీసుకొని కూర్చోలేదు. అన్ని రకాల పాత్రలూ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కొత్త విషయాలను ప్రయత్నించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గను. ఇప్పుడు కాకపోతే, ఎప్పుడు?
ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నా. వరుణ్ తేజ్‌తో కలిసి చేస్తున్న ‘మట్కా’ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అవుతుంది. దాంతోపాటు మరో తమిళ సినిమాలోనూ చేస్తున్నా.