Meenakshi Chaudhary | ఇటీవల విడుదలైన ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకుంది పంజాబీ భామ మీనాక్షి చౌదరి. గృహిణి పాత్రలో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. అయితే గత కొంతకాలంగా వరుసగా భార్య పాత్రల్లో నటిస్తున్నానని, కొంతకాలం పాటు ఆ తరహా క్యారెక్టర్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పింది మీనాక్షి చౌదరి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ “లక్కీ భాస్కర్’ చిత్రంలో నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే కొంతమంది మాత్రం కెరీర్ ఆరంభంలో హౌస్‌వైఫ్ పాత్రలు చేయకపోవడమే బెటర్ అని, అందుకు చాలా సమయం ఉందని సలహా ఇచ్చారు.
ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా నేను ఆ క్యారెక్టర్‌ను ఎంతగానో ఇష్టపడి చేశాను. అయితే రాబోవు కొన్నేళ్ల పాటు ఆ తరహా క్యారెక్టర్స్ చేయొద్దని నిర్ణయించుకున్నా. త్వరలో నేను ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నా. అందులో పోలీస్ క్యారెక్టర్‌ను పోషిస్తున్నా. కెరీర్లో తొలిసారి పోలీస్ అధికారి పాత్రను చేయడం ఎక్సైయిటింగ్గా అనిపిస్తున్నది. నన్ను సరికొత్త ఇమేజ్‌లో ఆవిష్కరించే చిత్రమవుతుంది’ అని చెప్పింది.