Meena | దక్షిణాది సినీ ప్రేక్షకులను తన అందం, అభినయంతో కట్టిపడేసిన నటి మీనా మరోసారి వార్తల్లో నిలిచింది. చిన్న వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అగ్రహీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమె, ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉంది. 2009లో సాఫ్ట్వేర్ ఉద్యోగి విద్యాసాగర్‌ని వివాహం చేసుకున్న మీనా కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుండగా, 2022లో ఆయన ఆకస్మిక మరణం ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది. అయినప్పటికీ, కూతురి కోసం ధైర్యంగా నిలిచి మళ్లీ తన కెరీర్‌పై దృష్టి పెట్టింది.
ఇటీవల రెండో వివాహంపై వస్తున్న పుకార్లను ఖండించిన మీనా “నా జీవితాన్ని నేనే చూసుకుంటాను, నేను ప్రస్తుతం నా కూతురితో సంతోషంగా ఉన్నాను” అంటూ స్పష్టం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనా తన సినీప్రస్థానంలోని అరుదైన అనుభవాలను పంచుకుంది. “ఓ సమయంలో రోజుకు నాలుగు సినిమాల షూటింగులు చేసేదాన్ని. భోజనం, నిద్రకు కూడా సమయం ఉండేది కాదు. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి, కానీ సమయం లేక చేయలేకపోయాను. పైగా హిందీ సినిమాల్లో షూటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంటుందని భయపడ్డాను,” అని చెప్పింది.
ఇక బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తితో ఒక మధురస్మృతిని కూడా ఆమె పంచుకుంది. “ఊటీలో మిథున్ గారికి ఓ హోటల్ ఉండేది. షూటింగ్స్ ఎక్కువగా అక్కడే జరగడంతో, ఆ హోటల్లోనే బస చేసేవాళ్లం. ప్రతిసారి ఆయన నా గది దగ్గరికి వచ్చి ‘మనిద్దరం ఎప్పుడు సినిమా చేద్దాం?’ అని అడిగేవారు. నాకు అప్పట్లో డేట్స్ అస్సలు ఖాళీ లేవు. ఆయన ప్రేమగా అడిగినప్పుడల్లా సిగ్గుగా అనిపించేది. చివరికి ఆ హోటల్లో ఉండడం కూడా మానేశాను. ఆ తర్వాత ఆయనతో సినిమా చేయలేకపోయాననే బాధ మాత్రం ఇంకా ఉంది,” అని మీనా స్మరించుకుంది. దక్షిణాది చిత్రసీమలో దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన మీనా, ఇప్పుడు వెబ్ సిరీస్‌లు, పాత్రకి ప్రాధాన్యం ఉన్న సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది.