Meena | బాలనటిగా ఇండస్ట్రీకి వచ్చిన మీనా తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన మీనా నిజ జీవితంలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ అమ్మడు రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించి అలరించింది. 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను వివాహం చేసుకున్న మీనా, కొంతకాలానికి సినీ పరిశ్రమకు విరామం ఇచ్చింది. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె జన్మించింది. నైనిక కూడా ‘తెరి’ (తెలుగులో ‘పోలీసోడు’) సినిమాలో విజయ్‌కి కూతురిగా నటించి మెప్పించింది.
అయితే, 2022లో కరోనా తర్వాత వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూశారు. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. భర్త మృతితో మీనా జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తన కుమార్తెతో ఒంటరిగా జీవితం కొనసాగిస్తూ, మనోధైర్యంతో ముందుకు సాగుతుంది. ఇటీవల జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమానికి గెస్ట్‌గా హాజరైన మీనా, తన జీవితంలోని బాధలు ముక్కుసూటిగా పంచుకుంది. “నా భర్త చనిపోయిన వారం రోజుల్లోనే నాకు రెండో పెళ్లి అంటూ పుకార్లు ఊపందుకున్నాయి. అలాంటి వార్తలు చూస్తే అసహ్యం వేసేది. ఒకరి మరణంపై కూడా ఈ స్థాయిలో రూమర్లు వస్తాయంటే, మనుషులేనా అనిపించింది. ఏ నటుడు విడాకులు తీసుకున్నా కూడా వెంటనే నన్ను అతనితో లింక్ చేస్తూ ఏవేవో వార్తలు రాసేవారు.
రెండేళ్ల పాటు జీవితాన్ని తట్టుకోవడం చాలా కష్టమైంది. ఒంటరిగా మిగిలిపోయిన భావన దుర్భరంగా అనిపించింది అంటూ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమైంది.అయితే, అలాంటి కష్టాలనుంచి తాను బయటపడగలగడం పక్కన ఉన్న స్నేహితుల కారణంగానే సాధ్యమైందని చెబుతోంది. “నా స్నేహితులే నాకు మానసికంగా ఎంతో బలాన్నిచ్చారు. నిజంగా నేను లక్కీ,” అంటూ కృతజ్ఞత తెలిపింది. తనకు రెండో పెళ్లిపై ఎలాంటి ఆలోచనలేమని స్పష్టం చేసింది. ప్రస్తుతం మీనా సినీ రంగంలో మళ్లీ చురుగ్గా కొనసాగుతోంది. ‘మూకుతి అమ్మన్ 2’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి 2’) అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా కెరీర్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మీనా, మంచి పాత్రలతో మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది.