MayaSabha Web Series Trailer | ప్రస్తుతం టాక్ ఆఫ్‌ది ఇండస్ట్రీగా మారిన వెబ్ సిరీస్ ‘మయసభ: రైజ్ ఆఫ్ ది టైటాన్స్’. దేవకట్టా, కిరణ్ జయకుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు విజయకృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మాతలు. ఈ నెల 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లీవ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. హీరో సాయిదుర్గతేజ్ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి, ట్రైలర్‌ని లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ .. ‘దేవా గారితో నాది పదేళ్ల ప్రయాణం. ‘ఆటోనగర్ సూర్య’ చూసిన వెంటనే దేవా గారికి ఫోన్ చేసి మాట్లాడాను. అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది. అలా ఆ జర్నీ నుంచి ‘రిపబ్లిక్’ వచ్చింది. ‘రిపబ్లిక్’ టైంలో జరిగిన ఘటనలో నాకు ఎప్పుడూ అండగా నిలిచారు. ఇప్పుడు ఇలా మళ్లీ దేవా కట్టా గారి కోసం ఇలా ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఓ మూడు పార్టులకు సరిపడా కథను రాశాను అని దేవా కట్టా గారు ‘మయసభ’ గురించి గతంలోనే ఎప్పుడో చెప్పారు. ఆది, చైతన్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. 30 వెడ్స్ 21 చూసి మా అమ్మ నన్ను పెళ్లి గురించి అడుగుతూ ఉండేవారు. అలా నా లైఫ్‌లో చైతన్య విలన్లా మారిపోయాడు. ‘రిపబ్లిక్’ టైంలో సాయి కుమార్ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ‘మయసభ’ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఈ సిరీస్ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
‘ఇదో అందమైన ఊహ. ఇద్దరు ప్రాణమిత్రుల ప్రయాణమే ఈ కథ. పరిస్థితుల వల్ల వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం ఏంటి? అనే కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ తీశాం. ఏపీ రాజకీయాల గురించి నిర్మాత శ్రీహర్ష నాదగ్గరకు వచ్చి మాట్లాడటంతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ముందు మూడు భాగాలుగా సినిమాకోసం కథ రాశాను. బడ్జెట్ దృష్ట్యా మళ్లీ ఆ కథను సిరీస్‌గా మార్చి రాశాను. ఈ కథ అనుకున్న వెంటనే ముందు నాకు గుర్తొచ్చిన నటుడు ఆది. ఆదిని మ్యాచ్ చేసేందుకు చైతన్య చాలా కష్టపడ్డారు. ఈ ప్రాజెక్టు కోసం 264మంది కొత్తవాళ్లను తీసుకున్నాం. సాంకేతికంగా కూడా అద్భుతంగా ఈ సిరీస్ ఉంటుంది.’ అని దర్శకుడు దేవ కట్టా తెలిపారు.
ఇంకా సోనీ లివ్ బిజినెస్ హెడ్ ధనీష్ కాంజీ, హీరోలు ఆది పినిశెట్టి, చైతన్యరావ్, నిర్మాతలు శ్రీహర్ష, విజయకృష్ణ లింగమనేని, చరితా వర్మ, దివ్యా దత్తా, శ్రీకాంత్ అయ్యంగార్, రవీంద్ర విజయ్, డీవోపీ సురేశ్, సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్, సహ దర్శకుడు కిరణ్ కూడా మాట్లాడారు.