మయసభ
సోనీలివ్: స్ట్రీమింగ్ అవుతున్నది.
తారాగణం: ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయికుమార్,
దివ్య దత్తా, నాజర్, రవీంద్ర విజయ్, తన్య రవిచంద్రన్ తదితరులు
దర్శకత్వం: దేవా కట్టా, కిరణ్ జయ్ కుమార్
చరిత్రకు కాల్పనికతను జోడిస్తూ.. ఎన్నో సినిమాలు, వెబ్‌సిరీస్‌లను నిర్మించారు. కళ్లారా చూడని కాలానికి కట్టు కథలు అల్లి చెప్పడంతో.. ప్రేక్షకులూ వాటికి బ్రహ్మరథం పట్టారు. ‘బ్లాక్‌బస్టర్’ స్థాయిని కట్టబెట్టారు. అయితే, తెలుగు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన ఇద్దరు ముఖ్యనేతల జీవితాలకు ఫిక్షన్‌ను జతచేస్తూ.. కథను అల్లుకున్నాడు దర్శకుడు దేవా కట్టా. చంద్రబాబు-వైఎస్ఆర్ స్ఫూర్తితో ‘మయసభ’ వెబ్‌సిరీస్‌ను ఇద్దరు దర్శకులు తెరకెక్కించారు. నిజజీవిత పాత్రలకు కాల్పనికతను జోడిస్తూ.. కొత్త పంథాలో సిరీస్‌ను నిర్మించారు. అదే సమయంలో తెలుగులో ఎప్పటినుంచో ఉన్న ‘పొలిటికల్ డ్రామా’ల కరువునూ తీర్చారు. మొత్తం 9 ఎపిసోడ్స్‌గా సోనీలివ్‌లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్.. రికార్డు వ్యూస్ దక్కించుకుంటున్నది. 80-90లలో దేశ-రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పులను కళ్లకు కడుతున్నది. ఆ ‘మయసభ’లోకి ఎంట్రీ ఇస్తే..
చిత్తూరు జిల్లా నర్సిపల్లి గ్రామానికి చెందిన కృష్ణమ నాయుడు (ఆది పినిశెట్టి).. సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. కాలేజీ రోజుల నుంచే రాజకీయాలంటే అమితాసక్తి. ప్రజలకు సేవ చేయాలని తపిస్తుంటాడు. మరోవైపు కడప జిల్లాలోని పులిచెర్ల గ్రామానికి చెందిన ఎంఎస్ రామిరెడ్డి (చైతన్య రావు) మెడిసిన్ చదువుతుంటాడు. అతని తండ్రి బాంబుల శివారెడ్డి (శంకర్ మహంతి) ఫ్యాక్షనిస్ట్. శివారెడ్డి వ్యవహారాలను రామిరెడ్డి వ్యతిరేకిస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో కృష్ణమ నాయుడు-రామిరెడ్డి కలుస్తారు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. కొద్దిరోజుల్లోనే ప్రాణమిత్రులుగా మారిపోతారు. ఇద్దరూ ఒకే పార్టీలో చేరి.. రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేలు, మంత్రులుగా బాధ్యతలు చేపట్టి.. ప్రజాసేవతోపాటు అందరి ఆదరాభిమానాలూ పొందుతారు.
అదే సమయంలో తెలుగు సినిమా స్టార్ హీరో రాయపాటి చక్రధర్ రావు (సాయికుమార్) ఇంటికి ‘నాయుడు’ అల్లుడవుతాడు. ఢిల్లీ పెద్దల వ్యవహారంతో తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతింటున్నదని భావిస్తాడు చక్రధర్ రావు. తన సినీ జీవితానికి స్వస్తి పలికి కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తాడు. ఇలాంటి సమయంలో ‘నాయుడు-రెడ్డి’ ఎలా వ్యవహరించారు? తన రాజకీయ జీవితానికి జన్మనిచ్చిన పార్టీని వదిలి.. నాయుడు తన మామ పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చింది? తాను ఎంతగానో అభిమానించే చక్రధర్ రావు పార్టీలోకి రెడ్డి ఎందుకు వెళ్లలేకపోయాడు? ఈ మధ్యలో కృష్ణమ నాయుడు లవ్ స్టోరీ ఏంటి? ప్రధాని ఐరావతి బసు నిర్ణయాలు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారి తీశాయి? అసలు వైద్య వృత్తిని వదిలి రామిరెడ్డి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు? ఆపదలో ఆదుకోవాలని కోరిన నాయుడికి.. రెడ్డి సహకరించాడా? ప్రాణమిత్రులుగా ఉన్న నాయుడు-రెడ్డి బద్ధ శత్రువులుగా ఎలా మారారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ ‘మయసభ’.