Kaantha | మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన పీరియడికల్ డ్రామా ‘కాంత’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా, చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు వేఫెరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1940–50 దశకాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్, పోస్టర్లతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఇప్పుడు ‘కాంత’ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే ఈ చిత్రంలో 1957లో విడుదలైన క్లాసిక్ బ్లాక్‌బస్టర్ ‘మాయాబజార్’ సినిమా చిత్రీకరణకు ఉపయోగించిన కెమెరానే మళ్లీ వినియోగించారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రానా దగ్గుబాటి స్వయంగా వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ .. మాయాబజార్, పాతాళ భైరవి చిత్రాలకు ఉపయోగించిన మిచెల్ కెమెరాను ‘కాంత’ సినిమా షూట్ కోసం మళ్లీ వాడాం. పాత కెమెరాలను వాడాల్సిన అవసరం ఉండటంతో దాన్ని ఉపయోగించాం,” అని తెలిపారు.
అంతేకాదు, ఆ కెమెరా తమ దగ్గరికి ఎలా వచ్చింది అన్న విషయాన్ని కూడా రానా వివరించారు. ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కొన్నేళ్ల క్రితం వాహిని స్టూడియో నుంచి ఆ మిచెల్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారట. ఇప్పుడు దానిని రానా, ‘కాంత’ షూట్ కోసం మళ్లీ వాడారు. ఆ కెమెరాతో షూట్ చేసిన ఓ షాట్ ట్రైలర్లో కూడా ఉంటుంది. అది నాకు చాలా స్పెషల్‌గా అనిపించింది అని తెలిపారు. ఇక ఈ సర్ప్రైజ్ రివీల్‌తో ‘కాంత’పై అంచనాలు మరింత పెరిగాయి. మరి మిచెల్ కెమెరాతో చిత్రీకరించిన ఆ విజువల్స్ తెరపై ఎలాంటి ఫీలింగ్ అందిస్తాయో నవంబర్ 14న చిత్రం రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.