Kiccha Sudeep | కన్నడ స్టార్ సుదీప్ ప్రస్తుతం తన తాజా సినిమా ‘మ్యాక్స్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కన్నడ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుదీప్తో ఓ విలేఖరి.. ‘మీరు కన్నడ నటుడు అయ్యుండి సినిమాకు ఇంగ్లిష్‌లో పేరు ఎందుకు పెట్టారు?’ అని ప్రశ్నించాడు. దాంతో సుదీప్ కాసేపు మౌనంగా ఉండిపోయారు.
అనంతరం ఆ విలేఖరి వైపు సూటిగా చూస్తూ.. అతనికి తనముందున్న మైకుల్ని చూపిస్తూ.. వీటిని కన్నడంలో ఏమంటారు? అనడిగారు. సదరు విలేఖరి నుంచి సమాధానం లేదు. ‘సరే.. వీటిని ఇంగ్లిష్‌లోనే ఎందుకు పిలుస్తారు?.. నేను కన్నడ నటుడ్నని ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే కన్నడలోనే మాట్లాడతాను కాబట్టి. నేనున్న సినిమా కన్నడ సినిమా అని కూడా అందరికీ తెలుసు. ఇక పేరుతో ప్రమేయం ఏముంది? అలా అయితే.. కర్ణాటకలో ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ ఉండకూడదు. అసలు మీ సమస్య ఏంటి? ఏ ఫర్ యాపిల్ అంటారు కదా.. యాపిల్‌ను కన్నడలో ఏమంటారో చెప్పండి?’ అని ప్రశ్నిచే సరికి సదరు విలేఖరి నీళ్లు నమిలాడు.